NTV Telugu Site icon

Mamata-Naveen Meeting: నవీన్‌ పట్నాయక్‌ను కలిసిన మమత.. థర్డ్ ఫ్రంట్‌ కోసమేనా?

Odisha

Odisha

Mamata-Naveen Meeting: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఇవాళ సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇద్దరు బీజేపీయేతర ముఖ్యమంత్రులు భేటీ కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పరచడానికి తృణమూల్ అధినేత నాయకత్వం వహిస్తున్నారనే ఊహాగానాలకు బలం చేకూర్చినట్లయింది. మమతా బెనర్జీ ఒడిశాలో పర్యటిస్తున్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆహ్వానంపై ఆమె ఆ రాష్ట్రంలో పర్యటించినట్లు తెలుస్తోంది.

తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీ ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోనూ పర్యటించారు. అక్కడ సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మమత బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌లు సంయుక్తంగా ఒక ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు సమాన దూరం పాటిస్తామని వారు స్పష్టం చేశారు. దాంతో, ఇప్పుడు ఒడిశా పర్యటనలోనూ మమత బెనర్జీ, బిజూజనతాదళ్ చీఫ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా అదే తరహాలో ఒక సంయుక్త ప్రకటన చేసే అవకాశముందని భావిస్తున్నారు. మమతా బెనర్జీ శుక్రవారం కోల్‌కతాలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) నాయకుడు హెచ్‌డి కుమారస్వామిని కలవనున్నారు. ఆమె ఈ నెలాఖరులో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా కలిసే అవకాశం ఉంది.

Read Also: Piyush Goyal: రాహుల్‌ గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాల్సిందే.. పార్లమెంట్‌లో గోయల్

మమతా బెనర్జీ, బిజూ జనతాదళ్‌కు నాయకత్వం వహిస్తున్న నవీన్ పట్నాయక్‌ల మధ్య జరిగిన సమావేశం మర్యాదపూర్వక సమావేశంగా అభివర్ణించబడుతోంది. అయితే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఒడిశాలో ఎన్నికలు జరగనున్నందున థర్డ్‌ ఫ్రంట్‌ కోసమేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు మమత ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నవీన్‌ పట్నాయక్‌ను కలిశారని పలువురు భావిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత బెనర్జీ బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో గట్టి పోటీ ఇచ్చిన బీజేపీని చిత్తుగా ఓడించిన మమతా బెనర్జీ.. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించడం లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా, పలు రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో కలిసి ఒక బలమైన మూడో కూటమి ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. ఒడిశాలో బలంగా ఉన్న, 21 లోక్‌సభ స్థానాల్లో కనీసం 20 సీట్లు గెలుచుకోగల బీజేడీని తమ కూటమిలో చేర్చుకోవడం కోసం మమత ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, తెలంగాణ సీఎం, భారత రాష్ట్రీయ సమితి అధ్యక్షుడు కే చంద్ర శేఖర్ రావు కూడా రానున్న లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ కేంద్రంగా మూడో కూటమి (third front) కోసం ప్రయత్నిస్తున్నారు.

Show comments