Malati Murmu: విద్య వ్యాపారం అయిన ఈ రోజుల్లో ఆమె పోరాటం అసామాన్యం. ప్రభుత్వం చేరుకోలేని చోటున ఆమె పిల్లలకు అక్షరాలు నేర్పిస్తుంది. కొండల్లో ఒక్కో రాయిని పేర్చినట్లు సుమారుగా 45 మంది విద్యార్థులను ఒక చోటుకు చేర్చి వారికి విద్యాబుద్ధులు నేర్పుతుంది. ఒక చేతిలో తన బిడ్డను పట్టుకొని మరొక చేతితో విద్యార్థులతో అక్షరాలు దిద్దిస్తూ ఎందరికో ఆదర్శనీయంగా నిలుస్తున్న టీచర్ ఆమె. జీతం లేదు, సరైన మౌలిక సదుపాయాలు లేవు.. అయితే ఏమిటి రేపటి పౌరులను ప్రయోజకులుగా, అక్షరాసులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు వచ్చిన మేడం ఆమె. ఇంతకీ ఎవరూ ఆ టీచర్, ఏంటి ఆమె కథ అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Kaantha: రేపు రిలీజ్.. సినిమా వాయిదా వేసిన టీమ్!
పశ్చిమ బెంగాల్‌లోని అయోధ్య కొండలలోని మారుమూల గ్రామం జిలింగ్ సెరెంగ్. అక్కడ 30 ఏళ్ల మాలతి ముర్ము వ్యవస్థ చేయలేని బాధ్యతలు స్వీకరించారు. పట్టణ వీధులకు, అధికారిక పథకాలకు దూరంగా ఉన్న గిరిజన గ్రామంలో తగరపు పైకప్పు గల మట్టి గుడిసెలో ఉచిత పాఠశాలను నడుపుతోంది. ఆమె ప్రభుత్వం నియమించిన ఉపాధ్యాయురాలు కాదు. ఆమె పాఠశాలలో బ్లాక్‌బోర్డులు, సిబ్బంది, నిధులు లేవు. కానీ ప్రతి ఉదయం 45 మంది పిల్లలకు ఓల్ చికి లిపిని ఉపయోగించి సంతాలిలో చదవడం, రాయడం నేర్చుకోవడానికి వస్తారు.
పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాల్లో పాఠశాలలను నిర్వహించడానికి ప్రభుత్వం ఇబ్బంది పడుతుండగా, జిలింగ్ సెరెంగ్‌లోని ఈ చిన్న ప్రయత్నం సమాజానికి గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఆమె ప్రయత్నం 2020 లో వారి ఇంట్లో కొంతమంది పిల్లలతో ప్రారంభమైంది. తర్వాత ఆమె మంచి ప్రయత్నాన్ని అర్థం చేసుకున్న గ్రామస్థులు ఆమెకు రెండు చిన్న తరగతి గదులను నిర్మించడంలో సహాయం చేశారు. నేడు ఆమె ఆధ్వర్యంలో 45 మంది విద్యార్థులు 4వ తరగతి వరకు చదువుకుంటున్నారు. “పెళ్లి తర్వాత నేను ఇక్కడికి వచ్చినప్పుడు, నాకు అసలు ఇక్కడ చదువు కనిపించలేదు” అని మాలతి పేర్కొన్నారు. ” దీంతో నేను మా ఇంట్లో కొంతమంది పిల్లలతో ఉచిత స్కూల్ ప్రారంభించాను” అని అన్నారు. ఇక్కడ చాలా మంది పిల్లలు ఎప్పుడూ పాఠశాలకు వెళ్లని గిరిజన కుటుంబాల నుంచి వచ్చారు. ఇప్పుడు వారు తమ భాషలో చదవడం, రాయడం నేర్చుకుంటున్నారు. మాలతి భర్త బంకా ముర్ము పాఠశాల నిర్వహణకు ఆమెకు సహాయం చేస్తున్నారు.
కుటుంబాన్ని చూసుకుంటూనే.. పాఠశాల నిర్వాహణ
మాలతి తన ఇద్దరు పిల్లలను పెంచుతూ, ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూనే పాఠశాలను నడుపుతోంది. తాము విద్యను నేర్చుకోడానికి వచ్చే పిల్లల నుంచి ఏమీ అడగము అని ఆమె చెబుతున్నారు. ఆమె గిరిజన సమాజానికి చెందిన మహిళ. ఆమె ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాలని నిర్ణయించుకొని ఆ వైపుగా తొలి అడుగు వేసింది. ఇక్కడి పాఠశాలలో అపాయింట్‌మెంట్‌లు లేవు, టెండర్లు లేవు, అవసరం నుంచి పుట్టిన తరగతి గది మాత్రమే ఉందని అంటున్నారు స్థానికులు. ఏదేమైనా ఈ మేడం మాత్రం చాలా ప్రత్యేకమని చెబుతున్నారు. ఎలాంటి జీతం లేకుండా పిల్లలకు ఉచిత విద్యను నేర్పుతున్న మాలతి ముర్మును ప్రభుత్వం గుర్తించాలని కోరారు.
READ ALSO: Israel: ‘‘అమెరికా ఏం చేసిందో మేము అదే చేశాం’’.. ఖతార్ దాడులపై ఇజ్రాయిల్..
