Site icon NTV Telugu

Srisailam: శ్రీశైలంలో నేటి నుంచి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

Srisailam

Srisailam

Srisailam: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది.. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం క్షేత్రంలో ఇవాళ్టి నుంచి ఈనెల 18వ తేదీ వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. పంచాహ్నిక దీక్షలతో 7 రోజులు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి.. శ్రీస్వామివారి యగశాల ప్రవేశంతో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.. సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ సాయంత్రం ధ్వజారోహణం, ధ్వజపటం ఆవిష్కరిస్తారు.. సంక్రాంతి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. నేటి నుంచి ఈనెల 18వ తేదీ వరకు రుద్ర, చండీహోమం, కళ్యాణం, ఏకాంతసేవ నిలుపుదల చేస్తున్నట్టు దేవస్థానం ఈవో పెద్దిరాజు ప్రకటించారు.

Read Also: Astrology: జనవరి 12, శుక్రవారం దినఫలాలు

శ్రీశైలంలో పంచాహ్నిక దీక్షతో 7 రోజులుపాటు వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాల్లో.. శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రతి రోజూ విశేష పూజలు నిర్వహిస్తారు.. యాగశాల ప్రవేశం, వేదస్వస్థి, శివసంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవచనం, చండీశ్వరపూజ, వాస్తుహోమం, మండపారాధనలు, రుద్రకళశస్థాపన, వేదపారాయణాలతోపాటు ప్రత్యేక పూజాధికాలు ఉంటాయి.. సాయంత్రం అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు ఉండనున్నాయి.. మకర సంక్రమణం రోజున ఆలయ సంప్రదాయం ప్రకారం గంగా పార్వతీ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, ఉత్సవాల చివరి రోజు పుష్పోత్సవ సేవ, శయనోత్సవ సేవ కార్యక్రమాలు ఉంటాయి.. కాగా, శివరాత్రి బ్రహ్మోత్సవాల తర్వాత ఆ స్థాయిలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు తరలివస్తారు భక్తులు.. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నారు. దీంతో.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లపై దృష్టి సారించారు అధికారులు.

Exit mobile version