Site icon NTV Telugu

Mahindra Scorpio Pick-Up: ఇండోనేషియాతో బిగ్‌ డీల్.. రికార్డు స్థాయిలో మహీంద్రా స్కార్పియో పిక్‌అప్‌ల ఎగుమతి..!

Mahindra Scorpio Pick Up

Mahindra Scorpio Pick Up

Mahindra Scorpio Pick-Up: మహీంద్రా & మహీంద్రా మరోసారి అంతర్జాతీయ మార్కెట్‌లో తన సత్తాను చాటింది. ఇండోనేషియాకు భారీగా 35,000 స్కార్పియో పిక్‌అప్ లైట్ కమర్షియల్ వెహికల్స్ (LCVs) ఎగుమతి చేయడానికి మహీంద్రా ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఇప్పటివరకు మహీంద్రా సాధించిన అతిపెద్ద ఒక్క ఎగుమతి ఆర్డర్‌ రికార్డు సృష్టించింది. ఈ ఒక్క ఒప్పందం 2025 ఆర్థిక సంవత్సరంలో మహీంద్రా చేసిన మొత్తం ఎగుమతుల కంటే ఎక్కువగా ఉండడం విశేషం.

గ్రామీణ లాజిస్టిక్స్‌కు బలం
ఈ వాహనాలను ఇండోనేషియా ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ అగ్రినాస్ పంగన్ నుసంతారాకు సరఫరా చేయనున్నారు. ఇండోనేషియా ప్రభుత్వం అమలు చేస్తున్న కోపెరాసి దేసా / కెలురహన్ మేరా పుతిహ్ (KDKMP) కార్యక్రమానికి ఈ వాహనాలు కీలకంగా ఉపయోగపడనున్నాయి. ఈ పథకం ద్వారా గ్రామీణ సహకార సంఘాలను బలోపేతం చేయడం, దేశవ్యాప్తంగా ఆహార సరఫరా వ్యవస్థను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

నాసిక్ ప్లాంట్‌లో తయారీ
ఇండోనేషియాకు ఎగుమతి చేసే సింగిల్-క్యాబ్ స్కార్పియో పిక్‌అప్‌లు మహీంద్రా నాసిక్ (మహారాష్ట్ర) ప్లాంట్‌లో తయారవుతాయి. ఇవి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడ్డాయి. పొలాల నుంచి సహకార సంఘాలకు, అక్కడి నుంచి మార్కెట్లకు తాజా వ్యవసాయ ఉత్పత్తులను తరలించడానికి ఇవి ఉపయోగపడతాయి. కఠినమైన గ్రామీణ రహదారులు, వ్యవసాయ మార్గాలపై కూడా సమర్థవంతంగా పనిచేసేలా ఈ వాహనాలను డిజైన్ చేశారు.

రైతులకు నేరుగా మార్కెట్లకు చేరువ
ఈ భాగస్వామ్యం ద్వారా సరఫరా గొలుసులను తగ్గించడం, వృధాను నియంత్రించడం, రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామీణ లాజిస్టిక్స్‌లో దీర్ఘకాలిక మార్పుకు ఇది దోహదపడుతుందని రెండు సంస్థలు భావిస్తున్నాయి. ఇక, దీనిపై స్పందించిన మహీంద్రా & మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ సీఈవో నళినీకాంత్ గొల్లగుంట మాట్లాడుతూ.. అగ్రినాస్ పంగన్ నుసంతారాతో భాగస్వామ్యం ద్వారా ఇండోనేషియా కోపెరాసి కార్యక్రమానికి మద్దతు ఇవ్వడం మాకు గర్వకారణం. స్కార్పియో పిక్‌అప్‌ల ద్వారా రైతులను మార్కెట్లతో సమర్థవంతంగా అనుసంధానించే బలమైన లాజిస్టిక్స్ వ్యవస్థను నిర్మిస్తున్నాం” అని తెలిపారు.

కఠిన పరిస్థితుల్లోనూ పనితీరు చూపేలా, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండేలా స్కార్పియో పిక్‌అప్‌లను రూపొందించినట్లు ఆయన చెప్పారు. ఈ భారీ ఆర్డర్‌తో మహీంద్రా అంతర్జాతీయ కార్యకలాపాలు గణనీయంగా విస్తరిస్తాయని, ఇది కంపెనీ ‘రైజ్’ తత్వానికి అనుగుణంగా శ్రేయస్సు సాధనకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. అయితే, ఈ ఒప్పందం ద్వారా ముఖ్యంగా ఆగ్నేయాసియా మార్కెట్‌లో మహీంద్రా ఉనికి మరింత బలపడింది. వ్యవసాయం, లాజిస్టిక్స్ రంగాలపై దృష్టి సారించిన అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మహీంద్రా LCV వాహనాలకు ఉన్న డిమాండ్‌ను ఇది స్పష్టంగా చూపిస్తోంది. ఇండోనేషియా జాతీయ ఆహార భద్రతా కార్యక్రమాలకు ఈ వాహనాలు కీలకంగా మారనున్నాయి. గ్రామాలను స్వయం సమృద్ధిగల ఆర్థిక యూనిట్లుగా మార్చే దిశగా ఈ భాగస్వామ్యం దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుందని రెండు సంస్థలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Exit mobile version