Site icon NTV Telugu

Rummy in Assembly: అసెంబ్లీలో రమ్మీ ఆడుతూ కెమెరాకు చిక్కిన మంత్రి.. వీడియో వైరల్..

Rummy

Rummy

మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి మాణిక్‌రావ్ కోకటే మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన మొబైల్‌లో రమ్మీ ఆడుతున్న వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ వివాదం మొదలైంది. ఈ సంఘటనను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. శివసేన కూడా మాణిక్‌రావ్ కోకటే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రోహిత్ పవార్ దీనిపై స్పందించారు. ఈ సంఘటన మహారాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతుందని అన్నారు. వ్యవసాయ మంత్రి మొబైల్‌లో బిజీగా ఉండగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సభలో ముఖ్యమైన అంశాలపై చర్చిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.

READ MORE: MP Mithun Reddy: లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి రిమాండ్..

మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి మాణిక్‌రావ్ కోకాటే శాసనసభ సమావేశంలో రమ్మీ ఆడుతున్నట్లు చూపించిన వీడియోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్‌సీపీ (శరద్‌చంద్ర పవార్) నాయకుడు రోహిత్ పవార్ అధికార కూటమిపై విమర్శలు గుప్పించారు. “రాష్ట్రంలో లెక్కలేనన్ని వ్యవసాయ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. రోజుకు 8 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వ్యవసాయ మంత్రికి ఇవేం పట్టడం లేదు. కానీ.. రమ్మీ ఆడటానికి సమయం దొరికినట్లు కనిపిస్తోంది” అని రోహిత్ పవార్ విమర్శించారు. అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ బీజేపీ అనుమతి లేకుండా ఏ పని చేయలేకపోతోందని ఆరోపించారు.

READ MORE: Tamil Nadu: భార్యపై దాడి చేసి, ఆస్పత్రిలో ఉన్నా కనికరం లేకుండా దారుణహత్య..

కాగా.. ఈ అంశంపై మంత్రి స్పందించారు. ప్రతిపక్షం తనను లక్ష్యంగా చేసుకుందని.. అసంపూర్ణ వీడియోని ఉపయోగించి నిందలు వేస్తోందని మంత్రి మాణిక్‌రావ్ కోకటే అన్నారు. తాను ఆట నుంచి ఎగ్జిట్ కావాలని ప్రయత్నించినట్లు తెలిపారు. పూర్తి వీడియోను చూస్తే అది అర్థం అవుతుందని స్పష్టం చేశారు. దిగువ సభలో ఏమి జరుగుతుందో YouTubeలో చూడటానికి తాను మొబైల్‌ను తీసుకున్నానని.. దీంతో రమ్మీకి సంబంధించిన ఆట తన ఫోన్‌లో డౌన్‌లోడ్ అయిందన్నారు.

Exit mobile version