Maharashtra Suicide: మహారాష్ట్రలో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. అకోలా జిల్లాలోని పరాస్ గ్రామంలో ఒక యువకుడు తన అత్తమామల వేధింపులతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని సంఘపాల్ సిద్ధార్థ్ ఖండారే (30) గా గుర్తించారు. ఆత్మహత్య చేసుకునే ముందు.. ఆ యువకుడు ఓ వీడియో రికార్డ్ చేసి తన సోదరుడికి పంపాడు. అందులో తన భార్య, బావమరిది, అత్తమామలు తనను కొట్టి, రూ.3 లక్షల అప్పు చేయాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపించాడు.
READ MORE: Jr NTR: నెపోటిజంపై ఎన్టీఆర్ సంచలనం.. నేను అలాంటోడిని కాదు!
పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం పరాస్ రైల్వే స్టేషన్ సమీపంలో సంఘ్‌పాల్ రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలం నుంచి మొబైల్, ఒక కీని కనుగొన్నారు. మృతుడిని సంఘపాల్ సిద్ధార్థ్ ఖండారే గా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలో బాధిత కుటుంబీకులు ఓ వీడియోను పోలీసులకు అందజేశారు. ఈ వీడియో 58 సెకన్ల నిడివి ఉంది. అందులో సంఘపాల్ “దాదా(అన్నయ్య), నేను నా భార్యతో గొడవ పడ్డాను. ఆమె బంధువు, సోదరుడు, వారి స్నేహితులు నన్ను కొట్టారు. ఎనిమిది రోజుల క్రితం.. మూడు లక్షల రూపాయల అప్పు తీసుకోవాలని నన్ను బలవంతం చేశారు. వారు నన్ను బ్రతకనివ్వడం లేదు. బెదిరిస్తున్నారు. నా భార్య, ఆమె సోదరుడు(బావమరిది), అత్తామామలు, సోదరి(మరదలు), బావమరిది స్నేహితులు సహా ఆరు నుంచి ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. వారు నన్ను చంపేస్తారు. వారి కంటే ముందు నేనే చనిపోతాను. నేను చనిపోయిన తర్వాత వారిని వదిలి పెట్టకండి. ఈ వీడియోను పోలీసులకు చూపించి వాళ్లపై కేసు నమోదు చేయించండి.” అని సంఘ్‌పాల్ తన చివరి వీడియోలో తన బాధను వ్యక్త పరిచాడు. అమ్మానాన్నలకు వీడ్కోలు తెలిపాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రైల్వే పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
