MP: మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. స్టేషన్ రోడ్డులో ఉన్న ఒక ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ చేసిన నిర్లక్ష్యం వల్ల, ఓ వ్యక్తి జీవితం గందరగోళంగా మారే పరిస్థితి వచ్చింది. అసలు విషయం ఏమిటంటే.. 47 ఏళ్ల పురుషుడికి చేసిన స్కాన్ రిపోర్టులో అతడికి గర్భాశయం ఉందని రిపోర్టులో రాశారు. ఆ గర్భాశయం తలకిందులుగా ఉందని పేర్కొన్నారు. తీరా చూస్తే రిపోర్టులో తప్పుగా రాశారని తేలింది. ఈ సంఘటన జరిగింది సాధారణ వ్యక్తికి కాదు. ఉచెహెరా నగర పంచాయతీ అధ్యక్షుడు నిరంజన్ ప్రజాపతి ఈ తప్పిదానికి బలయ్యారు. కొద్ది రోజులుగా ఆయనకు కడుపునొప్పి, వాపు సమస్యలు మొదలయ్యాయి. మొదట స్థానికంగా చికిత్స తీసుకున్నారు. ఉపశమనం లేకపోవడంతో జనవరి 13న సత్నాలోని ఒక డయాగ్నోస్టిక్ సెంటర్‌కు వెళ్లి స్కాన్ చేయించుకున్నారు. రిపోర్టు చూసిన తర్వాత ఆయనకు ఏం చేయ్యాలో అర్థం కాలేదు. పురుషుడైన తనకు గర్భాశయం ఉందని రాసి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు.
READ MORE: Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య కేసులో.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు
జబల్‌పూర్‌కు వెళ్లి డాక్టర్‌కు రిపోర్టును చూయించారు. సత్నా రిపోర్టును చూసిన వైద్యుడు ఆశ్చర్యపోయారు. “ఇది మీ రిపోర్టు ఎలా అవుతుంది? పురుషుడికి గర్భాశయం ఉండదు కదా” అని ప్రశ్నించారు. అప్పుడే ఈ పెద్ద తప్పిదం బయటపడింది. దీంతో ఆయన అవాక్కయ్యారు. “ఈ తప్పు రిపోర్టు చూసి డాక్టర్ ఆపరేషన్ చేసుంటే ఎవరు బాధ్యత వహిస్తారు?” అని బాధితుడు సత్నా వాపోయారు. ఈ ఘటన బయటకు రాగానే ఆరోగ్య శాఖలో కలకలం మొదలైంది. డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకుడిని సంప్రదించగా, ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించారు. మరోవైపు జిల్లా ఆరోగ్య అధికారి ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇది చిన్న తప్పు కాదని, రోగుల ప్రాణాలతో ఆడుకునే పని అని స్పష్టం చేశారు. పూర్తి విచారణకు ఆదేశాలు ఇచ్చామని, నిర్లక్ష్యం రుజువైతే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.
READ MORE: Trump-Iran: నన్ను చంపితే.. భూమిపై ఇరానే ఉండదు.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
