Airbus C295: భారతీయ విమానయాన, రక్షణ రంగాల చరిత్రలో గురువారం ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. దేశంలోనే మొదటిసారిగా తయారైన ‘మేడ్ ఇన్ ఇండియా’ ఎయిర్‌బస్ సీ295 (Airbus C295) మిలిటరీ రవాణా విమానం తన మొదటి టెస్ట్ ఫ్లైట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. గుజరాత్‌లోని వడోదరలో ఉన్న ఫైనల్ అసెంబ్లీ లైన్ (FAL) నుంచి ఈ విమానం గాల్లోకి ఎగిరి రికార్డు సృష్టించింది. విమానం తయారైన తర్వాత జరిగే పరీక్షల్లో ఈ టెస్ట్ ఫ్లైట్ అత్యంత కీలకమైనదని ఎయిర్‌బస్ డిఫెన్స్ సంస్థ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా వెల్లడించింది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ ముందడుగులో ఇదొక మైలురాయి అని పేర్కొంది. భారత్‌లో మొత్తం 40 సీ295 విమానాలను తయారు చేయాల్సి ఉండగా.. అందులో సిద్ధమైన మొదటి విమానం ఇదే. ఈ విజయవంతమైన ప్రయోగంతో ఈ ఏడాది చివర్లోనే మొదటి మేడ్ ఇన్ ఇండియా విమానాన్ని భారత వైమానిక దళానికి (IAF) అందించేందుకు మార్గం సుగమమైంది.
దేశ రక్షణ రంగంలో ఈ ప్రాజెక్ట్ ఒక ‘గేమ్ చేంజర్’ (పెద్ద మార్పు) అని నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే, భారతదేశంలో ఒక ప్రైవేట్ రంగ సంస్థ భాగస్వామ్యంతో మిలిటరీ విమానాన్ని తయారు చేయడం ఇదే మొదటిసారి. ఎయిర్‌బస్ సంస్థతో పాటు టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్, దేశవ్యాప్తంగా విమాన విడిభాగాలను తయారు చేస్తున్న ఎన్నో చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) ఉమ్మడి కృషి వల్లే ఈ కల సాకారమైంది. తమపై నమ్మకం ఉంచినందుకు భారత వైమానిక దళానికి, రక్షణ మంత్రిత్వ శాఖకు, భారత ప్రభుత్వానికి ఎయిర్‌బస్ సంస్థ ధన్యవాదాలు తెలియజేస్తూ, తాము భారతీయ అంతరిక్ష రంగ భవిష్యత్తును నిర్మిస్తున్నామని గర్వంగా ప్రకటించింది. మరోవైపు, ఈ చారిత్రాత్మక విజయానికి భారత వైమానిక దళం (IAF) సైతం హర్షం వ్యక్తం చేసింది. మొదటి సీ295 విమానం విజయవంతంగా ఎగరడం వెనుక ఉన్న పూర్తి బృందానికి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపింది. ఈ విజయం భారత అంతరిక్ష రంగ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా, ‘ఆత్మనిర్భర్ భారత్’ విజన్‌లో భాగంగా స్వదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీ పట్ల మన దేశానికి ఉన్న పట్టుదలను మరోసారి నిరూపించిందని ఐఏఎఫ్ పేర్కొంది.

