NTV Telugu Site icon

Machu Picchu: ప్రపంచ ప్రఖ్యాత టూరిస్ట్ స్పాట్ ‘మచు పిచ్చు’ రీఓపెన్‌.. సందర్శనకు అనుమతి

Machu Pichu

Machu Pichu

Machu Picchu: ప్రపంచంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన మచు పిచ్చును పెరూ ప్రభుత్వం పర్యాటకుల సందర్శనకు అనుమతి ఇచ్చింది. దక్షిణ అమెరికాలోని అతిపెద్ద పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన మచు పిచ్చు ఇంకాన్ సిటాడెల్ పౌరుల నిరసనల కారణంగా అనేక వారాల పాటు మూసివేయబడింది. చాలా రోజుల తర్వాత బుధవారం పెరూలో సందర్శకుల కోసం తిరిగి తెరవబడింది. డిసెంబరులో పెరూవియన్ మాజీ ప్రెసిడెంట్ పెడ్రో కాస్టిల్లో బహిష్కరణ, జైలు శిక్ష విధించడంలో పౌరులు ఆందోళన చేపట్టారు. పెరూలో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. పెరూ దేశాధ్యక్షుడు డినా బులెర్టోకు వ్యతిరేకంగా అక్కడ దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మచు పిచ్చుకు పర్యాటకులను ఆ దేశ ప్రభుత్వం అనుమతించలేదు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. మచు పిచ్చుకు టికెట్లను బుక్ చేసుకున్న వారికి డబ్బును తిరిగి చెల్లిస్తామని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఈ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాన్ని తెరవడంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.పెరూ దక్షిణాన కేంద్రీకృతమై ఉన్న నిరసనలు, రహదారి దిగ్బంధనాలు కొనసాగుతున్నప్పటికీ, ఇటీవలి రోజుల్లో కొంత ప్రశాంతత ఉంది. పర్యాటక ప్రదేశం వద్ద భద్రతకు, రవాణా సేవలకు హామీ ఇవ్వడానికి పర్యాటక వ్యాపారాలు, అధికారులు, కమ్యూనిటీ నాయకుల మధ్య ఒప్పందం తర్వాత తిరిగి మచుపిచ్చు పర్యాటక ప్రాంతాన్ని తిరిగి తెరిచారు. వేసవి సెలవుల్లో అర్జెంటీనా నుంచి వచ్చే సందర్శకులకు అక్కడ గడిపేందుకు వీలుగా ఉంటుంది.

Read Also: Jyotiraditya Scindia: కేంద్ర మంత్రి అద్భుత బ్యాటింగ్.. బీజేపీ కార్యకర్త తలకు గాయం

మచు పిచ్చు అనేది ప్రపంచంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. మచు పిచ్చు పర్వత కోట 15వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇది దక్షిణ అమెరికా దేశం పెరూలో ఉంది. మచు పిచ్చు సముద్ర మట్టానికి 2,430 మీటర్ల (7,970 అడుగులు) ఎత్తునున్న 15వ శతాబ్దపు ఇంకా సామ్రాజ్యం. ఇది పెరూలోని మచుపిచ్చు జిల్లా, ఉరుబంబా ప్రావిన్స్, కుస్కో ప్రాంతంలో ఉంది. ఇది 80 కిలోమీటర్ల దూరంలోని (50మైళ్లు) కుస్కోకు వాయువ్యంగా పవిత్ర లోయ పైన ఒక పర్వత శిఖరం పైన ఉన్నది. దీని ద్వారా ఉరుబంబా నది ప్రవహిస్తోంది. ఎక్కువ మంది పురాతత్వ శాస్త్రవేత్తలు మచు పిచ్చు ఇంకా చక్రవర్తి పాచాకుటి (1438-1472) కోసం నిర్మించబడిన ఒక ఎస్టేట్ వంటిదని నమ్ముతారు. తరచుగా పొరపాటుగా “లాస్ట్ సిటీ ఆఫ్ ది ఇంకాస్”గా సూచిస్తారు. ఇది స్థానికంగా పేరు గడించినప్పటికీ అమెరికన్ అన్వేషకుడు హిరామ్ బింగ్‌హామ్‌చే 1911లో అంతర్జాతీయ దృష్టికి తీసుకొచ్చేంత వరకు దీని గురించి బయట ప్రపంచానికి తెలియదు. అప్పటి నుంచి మచు పిచ్చు ఒక ముఖ్యమైన పర్యాటక ఆకర్షణగా మారింది. మచు పిచ్చు 1981లో ఒక పెరువియన్ హిస్టారికల్ అభయారణ్యంగా, 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది. 2007లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఇంటర్నెట్ పోల్‌లో ప్రపంచ న్యూ సెవెన్ వండర్స్‌లో ఒకటిగా మచు పిచ్చుకి ఓటింగ్ జరిగింది.