Site icon NTV Telugu

LPG Cylinder Delivery: రాష్ట్రంలో LPG సరఫరా నియంత్రణలోనే ఉంది.. ప్రభుత్వం కీలక ప్రకటన.!

Lpg Cylinder Price

Lpg Cylinder Price

LPG Cylinder Delivery: ఇరాన్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా LPG సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో LPG నిల్వలు, సరఫరా పరిస్థితిపై ప్రభుత్వం స్పష్టత ఇస్తూ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఇందులో ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 12 నాటికి రాష్ట్రంలో మొత్తం 17,962 మెట్రిక్ టన్నుల LPG నిల్వలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 161.19 లక్షల LPG కనెక్షన్లు ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో LPG సరఫరా పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉందని ప్రభుత్వం పేర్కొంది.

రాష్ట్రంలోని ఏ LPG బాట్లింగ్ ప్లాంట్‌ లోనూ గ్యాస్ పూర్తిగా అయిపోయిన పరిస్థితి ఇప్పటివరకు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. భారత్ మొత్తం LPG అవసరాల్లో సుమారు 60% దిగుమతులపై ఆధారపడుతోంది. ఈ దిగుమతుల్లో దాదాపు 90% గ్యాస్ “హోర్ముజ్” జలసంధి ద్వారా వస్తుంది. ప్రస్తుతం అక్కడి అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం గ్యాస్ సరఫరాపై కొంత మేర కనిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

ఈ నేపథ్యంలో మార్చి 8న కేంద్ర ప్రభుత్వం దేశంలోని రిఫైనరీలు, పెట్రోకెమికల్ యూనిట్లు LPG ఉత్పత్తిని పెంచాలని ఆదేశించింది. దీనివల్ల దేశీయంగా LPG ఉత్పత్తి సుమారు 25% వరకు పెరిగిందని వెల్లడించింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే LPGను ప్రధానంగా గృహ వినియోగదారులకు ప్రాధాన్యంగా అందిస్తున్నట్లు తెలిపింది. హోటళ్లు, రెస్టారెంట్స్, ఇతర కమర్షియల్ వినియోగదారులకు LPG కేటాయింపును సమీక్షించేందుకు ప్రత్యేకంగా ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సభ్యులుగా ఉన్నారు.

ధరల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో గృహ వినియోగదారుల LPG సిలిండర్ ధర ప్రస్తుతం రూ.935గా ఉంది. ఇటీవల రూ.60 పెంపు తర్వాత ఈ ధర అమల్లోకి వచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీపం 2.0 scheme పథకం కింద అర్హులైన కుటుంబాలకు సంవత్సరానికి మూడు LPG సిలిండర్లను 100 శాతం సబ్సిడీతో అందిస్తోంది. గ్యాస్ సరఫరాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి 9న “Essential Commodities Act” కింద న్యచ్యురల్ గ్యాస్ కంట్రోల్ ఆర్డర్ జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం గృహ వినియోగదారులకు ఉపయోగించే డొమెస్టిక్ PNG, వాహనాలకు ఉపయోగించే CNGకు 100% సరఫరా కొనసాగుతోంది.

LPG Gas Saving Tips: ఈ చిట్కాలు పాటిస్తే.. సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుంది..!

అయితే కొన్ని పరిశ్రమలపై పరిమితులు విధించారు. టీ పరిశ్రమలు, తయారీ యూనిట్లకు గత ఆరు నెలల సగటు సరఫరాలో 80 శాతం మాత్రమే అందుతుంది. ఎరువుల ఫ్యాక్టరీలకు 70% సరఫరా ఉంటే.. రిఫైనరీలు, పెట్రోకెమికల్ యూనిట్లకు 35% వరకు తగ్గింపు అమలు చేస్తున్నారు. ఇటీవల అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా కొంతమంది వినియోగదారులు ముందుగానే సిలిండర్లు బుక్ చేసి నిల్వ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం గమనించింది. అయితే సాధారణ పరిస్థితుల్లో LPG సిలిండర్ డెలివరీ సమయం సుమారు 2.5 రోజులు మాత్రమే ఉంటుందని అధికారులు తెలిపారు.

తాత్కాలికంగా సిలిండర్ బుకింగ్ మధ్య గ్యాప్‌ను 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచినట్లు పేర్కొన్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, జిల్లా అమలు బృందాలు కలిసి డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఉన్న పెండింగ్ డెలివరీలను వేగంగా క్లియర్ చేస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం గమనిస్తూ గృహ వినియోగదారులు, ఆసుపత్రులు, ముఖ్య రంగాలకు LPG సరఫరా ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Exit mobile version