దేశంలోని గృహ వినియోగ ఎల్పీజీ (LPG) గ్యాస్ కనెక్షన్ దారులకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక సూచన చేసింది. అక్టోబర్ 1, 2026 నుంచి గ్యాస్ సబ్సిడీ నేరుగా పొందాలంటే వినియోగదారులు తప్పనిసరిగా బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారి సబ్సిడీ నిలిచిపోయి, సిలిండర్ కోసం పూర్తి మార్కెట్ ధర చెల్లించాల్సి వస్తుంది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా 27.43 కోట్ల మంది (సుమారు 89.9 శాతం మంది) వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. ఒకవేళ మీరు ముందే బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తి చేసి ఉంటే, మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. గడువు ముగిసిన తర్వాత కూడా ఎప్పుడైనా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు, అయితే అథెంటికేషన్ పూర్తయ్యే వరకు సబ్సిడీ వర్తించదు.
బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తి చేసే మార్గాలు ఇవే..
ఇంటి వద్దే మొబైల్ యాప్ ద్వారా: గ్యాస్ కంపెనీలను బట్టి IndianOil ONE (ఇండేన్), HelloBPCL (భారత్ గ్యాస్), లేదా HP PAY (హెచ్‌పీ గ్యాస్) అధికారిక మొబైల్ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు.
నేరుగా: గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే సమయంలో డెలివరీ బాయ్ ద్వారా లేదా మీ సమీపంలోని గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాన్ని సందర్శించి బయోమెట్రిక్ పూర్తి చేయవచ్చు.
ప్రస్తుతం 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్పై కేంద్ర ప్రభుత్వం రూ. 210 సబ్సిడీ అందిస్తోంది. ఈ ప్రక్రియకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే 1800 2333 555 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు.

