LPG e-KYC Deadline: గ్యాస్ వినియోగదారులకు కీలక హెచ్చరిక.. ఈ డెడ్‌లైన్ మిస్ అయితే.. నో గ్యాస్‌..!

Gas Cylindersss

Gas Cylindersss

LPG e-KYC Deadline: ఎల్‌పీజీ (LPG) వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కీలక హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. గతంలో ఇచ్చిన డెడ్‌లైన్‌ జూలై 31వ తేదీతోనే ముగియగా.. ఇప్పుడు వినియోగదారులకు మరో అవకాశం ఇచ్చారు.. ముఖ్యంగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ వినియోగదారులు, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు ఆగస్టు 16, 2026లోగా తప్పనిసరిగా e-KYC ప్రక్రియను పూర్తి చేయాలని సూచిస్తున్నాయి. ఈ గడువులోగా ప్రక్రియ పూర్తి చేయకపోతే గృహ వినియోగ ధరలకు సిలిండర్ పొందడంలో ఇబ్బందులు తలెత్తడంతో పాటు, ఉజ్వల యోజన సబ్సిడీ కూడా నిలిచిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి.

SMSల ద్వారా అప్రమత్తం చేస్తున్న కంపెనీలు
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వరుసగా SMSలు పంపుతున్నాయి. “గృహ వినియోగ ధరలకే LPG సిలిండర్ పొందాలంటే తప్పనిసరిగా e-KYC పూర్తి చేయాలి. పలుమార్లు గుర్తు చేసినప్పటికీ మీరు ఇంకా e-KYC పూర్తి చేయలేదు” అని సందేశాల్లో పేర్కొంటున్నాయి. ఆగస్టు 16లోపు ఈ ప్రక్రియ పూర్తికాకపోతే దేశీయ ధరలకు LPG సిలిండర్ పొందే అర్హత కోల్పోయే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నాయి.

గృహ వినియోగదారులు, ఉజ్వల లబ్ధిదారులకు కీలక సూచన
ఆధార్ ఆధారిత e-KYC ప్రక్రియను గృహ వినియోగ LPG వినియోగదారులందరూ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. నిర్దేశించిన గడువులోగా e-KYC పూర్తికాకపోతే ప్రభుత్వ సబ్సిడీ జమ కావడంలో అంతరాయం ఏర్పడే అవకాశముందని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి.

ఉజ్వల యోజనలో 10 కోట్లకు పైగా లబ్ధిదారులు
2016లో ప్రారంభమైన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద దేశవ్యాప్తంగా 10 కోట్లకు పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ప్రస్తుతం ఈ పథకం కింద ఏడాదికి నాలుగు LPG రీఫిల్‌లపై ఒక్కో సిలిండర్‌కు రూ.300 చొప్పున డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా సబ్సిడీ అందుతోంది. గతంలో తొమ్మిది రాయితీ సిలిండర్లు అందుబాటులో ఉండగా, ఇటీవల నిబంధనల్లో మార్పులు చేశారు.

వాణిజ్య సిలిండర్ ధర తగ్గింపు.. గృహ సిలిండర్ ధర యథాతథం
ఆగస్టు 1, 2026 నుంచి 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ల ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. అయితే 14.2 కిలోల గృహ వినియోగ LPG సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం గృహ వినియోగ LPG సిలిండర్ ధరలు ఢిల్లీ – రూ.942, కోల్‌కతా – రూ.968, ముంబై – రూ.941.50, చెన్నై – రూ.957.50గా ఉన్నాయి..

ఇంటి నుంచే e-KYC పూర్తి చేసే అవకాశం
LPG వినియోగదారులు ఇంటి నుంచే సులభంగా e-KYC పూర్తి చేసుకోవచ్చు. IndianOil One App ద్వారా, సంబంధిత LPG డిస్ట్రిబ్యూటర్‌ను నేరుగా సందర్శించడం ద్వారా లేదా గ్యాస్ డెలివరీ సిబ్బంది సహాయంతో కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఆగస్టు 16, 2026లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాయి.