లండన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. వినాయక నిమజ్జనానికి వెళ్లి.. తిరిగి వస్తుండగా రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వాసులు నాదర్‌గుల్‌కు చెందిన తర్రె చైతన్య యాదవ్ (23), ఉప్పల్‌కు చెందిన రిషి తేజ (21) అక్కడిక్కడే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి గురైన వారందరూ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే.
Also Read: Kaleshwaram Project: కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరపండని కేంద్రకు లేఖ.. వాట్ నెక్స్ట్!
హైదరాబాద్‌లోని నాదర్ గుల్‌కు చెందిన తర్రె ఐలయ్య, మంగమ్మ దంపతుల చిన్న కుమారుడు చైతన్య యాదవ్. ఇక్కడ బీటెక్ పూర్తి చేసిన చైతన్య.. ఎంఎస్ కోసం 7 నెలల కిందట లండన్ వెళ్లాడు. లండన్‌లో వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుని.. 8 మంది స్నేహితులతో రెండు కార్లలో నిమజ్జనానికి వెళ్లారు. నిమజ్జనం అనంతరం తిరిగి వస్తుండగా రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చైతన్య, రిషి తేజ మృతి చెందారు. ప్రమాదం గురించి సోమవారం రాత్రి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. చైతన్య, రిషి తేజ మృతితో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
