NTV Telugu Site icon

ICC World Cup 2023: నెదర్లాండ్స్‌ నెట్‌ బౌలర్‌గా తమిళనాడు క్రికెటర్‌.. 4 ఏళ్లుగా ఫుడ్‌ డెలివరీ చేస్తూనే..!

Lokesh Kumar Netherlands

Lokesh Kumar Netherlands

Lokesh Kumar Is Netherlands Net Bowler For ICC World Cup 2023: తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ ఐదో డివిజన్‌ లీగ్‌లో ఆడుతున్న క్రికెటర్ లోకేశ్‌ కుమార్‌కు మంచి రోజులు వచ్చాయి. ఇప్పటివరకు థర్డ్‌ డివిజన్‌ లీగ్‌లో కూడా ఆడని లోకేశ్‌.. ఏకంగా వన్డే ప్రపంచకప్‌ 2023 కోసం సిద్ధం అవుతున్న నెదర్లాండ్స్‌ నెట్‌ బౌలర్‌గా ఎంపికయ్యాడు. వేలాది మందిలో నలుగురు ఫైనలిస్టులలో ఒకడిగా లోకేశ్‌ అవకాశం దక్కించుకున్నాడు. నెదర్లాండ్స్‌ నెట్‌ బౌలర్‌గా ఎంపికయ్యానని తెలిసి తాను ఆనందంలో మునిగిపోయాయని, ఎదో ఓ రోజు భరత జట్టులో ఆడుతాననే నమ్మకం తనకు వచ్చిందని లోకేశ్‌ తెలిపాడు. అయితే లోకేశ్‌ నెట్‌ బౌలర్‌గా ఎంపికవడానికి ఎంతో కష్టపడ్డాడు.

సాధారణ కుటుంబంలో జన్మించిన లోకేశ్‌ కుమార్‌కు మంచి క్రికెటర్‌గా ఎదగాలని కల. ఎనిమిదేళ్ల క్రితం లోకేశ్‌ పేసర్‌గా తన ప్రయాణం మొదలు పెట్టాడు. అయితే కొంతకాలం తర్వాత చైనామన్‌ స్పిన్నర్‌గా మారాడు. తన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ.. తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ డివిజన్‌ లీగ్‌లలో ఆడుతున్నాడు. గత నాలుగేళ్లుగా ఐదో డివిజన్‌లో ఆడుతున్న అతడు ఈసారి నాలుగో డివిజన్‌లో ఆడేందుకు రిజిస్టర్‌ చేసుకున్నాడు. అయితే పొట్టకూటి కోసం లోకేశ్‌ స్విగ్గీలో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు క్రికెట్‌లో రాణించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడాలని చూస్తున్న లోకేశ్‌ కుమార్‌కు.. ప్రపంచకప్‌ 2023 ప్రాక్టీసులో భాగంగా తమకు భారత నెట్‌ బౌలర్లు కావాలని నెదర్లాండ్స్‌ క్రికెట్‌ బోర్డు ఇచ్చిన ప్రకటన తెలిసింది. వెంటనే అప్లికేషన్‌ పెట్టుకోగా.. వేలాది మందిని వెనక్కి నెట్టి ఎంపికయ్యాడు. హైదరాబాదీ రాజమణి ప్రసాద్‌, హర్యానాకు చెందిన హర్ష్‌ శర్మ, రాజస్తాన్‌ హైకోర్టు ఉద్యోగి హేమంత్‌ కుమార్‌లతో పాటు లోకేశ్‌ తాజాగా నెదర్లాండ్స్‌ క్యాంపులో అడుగుపెట్టాడు. మొదటి ట్రెయినింగ్‌ సెషన్‌లో భాగంగా ఈ నలుగురిని నెదర్లాండ్స్‌ బోర్డు తమ ఆటగాళ్లకు పరిచయం చేసింది.

Also Read: IND vs AUS: ఆస్ట్రేలియాకు సూపర్ ట్రాక్‌ రికార్డు.. వన్డేల్లో భారత్‌ ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు!

ట్రెయినింగ్‌ సెషన్‌ అనంతరం లోకేశ్‌ మాట్లాడుతూ… ‘నా కెరీర్‌లో ఇవే విలువైన క్షణాలు. నేనింత వరకు కనీసం తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ థర్డ్‌ డివిజన్‌ లీగ్‌లో కూడా ఆడలేదు. అలంటి నేను నెదర్లాండ్స్‌ నెట్‌ బౌలర్‌గా ఎంపికయ్యానని తెలిసి సంతోషించా. నా ప్రతిభను గుర్తించే వాళ్లు కూడా ఉన్నారని ఫీల్ అయ్యా. మొదటి ట్రెయినింగ్‌ సెషన్‌ బాగా సాగింది. నెదర్లాండ్స్‌ జట్టు సభ్యులు మాకు స్వాగతం పలికారు. పరిచయ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇది మీ జట్టు, మీరు స్వేచ్ఛగా ఆడవచ్చు అని ప్రోత్సహించారు. నెదర్లాండ్స్‌ జట్టులో సభ్యుడినయ్యా అని నేను ఫీల్ అవుతున్నా’ అని తెలిపాడు. ప్రస్తుతం బెంగళూరులోని ఆలూరులో నెదర్లాండ్స్‌ ట్రెయినింగ్‌ క్యాంపు నిర్వహిస్తోంది. సెప్టెంబరు 29న పాకిస్తాన్‌తో తొలి వార్మప్‌ మ్యాచ్‌ డచ్ టీం ఆడనుంది.