LLC 2024: గబ్బర్‌ గర్జించినా.. గుజరాత్‌ గ్రేట్స్‌కు తప్పని ఓటమి!

  • శిఖర్‌ ధావన్ హాఫ్ సెంచరీ
  • గుజరాత్‌ గ్రేట్స్‌కు తప్పని ఓటమి
  • చతురంగ డిసిల్వ ఫిఫ్టీ
Shikhar Dhawan

Shikhar Dhawan

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌లో శిఖర్‌ ధావన్ సారథ్యం వహిస్తున్న గుజరాత్‌ గ్రేట్స్‌ టీమ్.. దినేశ్‌ కార్తీక్‌ నేతృత్వంలోని సథరన్‌ సూపర్‌ స్టార్స్‌పై ఓడిపోయింది. గబ్బర్‌ హాఫ్ సెంచరీతో గర్జించినా గుజరాత్‌ గ్రేట్స్‌కు ఓటమి తప్పలేదు. 37 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న ధావన్.. 48 బంతుల్లో 108.33 స్ట్రైక్ రేట్‌తో 52 పరుగులు చేశాడు. టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అయిన గబ్బర్.. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన సూపర్‌ స్టార్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. చతురంగ డిసిల్వ (53 నాటౌట్‌; 28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ద సెంచరీ చేశాడు. మార్టిన్‌ గప్తిల్‌ (22), హమిల్టన్‌ మసకద్జ (20), దినేశ్‌ కార్తీక్‌ (18) పరుగులు చేశారు. గుజరాత్‌ గ్రేట్స్‌ బౌలర్లలో మనన్‌ శర్మ 6 వికెట్లు పడగొట్టాడు.

లక్ష్య ఛేదనలో గుజరాత్‌ గ్రేట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. శిఖర్‌ ధావన్ మినహా మిగతావారెవరూ రాణించలేదు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన మోర్నీ వాన్‌ విక్‌ (15) త్వరగా అవుట్ అవ్వడం దెబ్బకొట్టింది. లెండిల్‌ సిమన్స్‌ (7), మొహమ్మద్‌ కైఫ్‌ (5), అస్గర్‌ అఫ్ఘాన్‌ (3), మనన్‌ శర్మ (10) విఫలమయ్యారు. సథరన్‌ సూపర్‌ స్టార్స్‌ బౌలర్లలో పవన్‌ నేగి 3, అబ్దుర్‌ రజాక్‌ 2 వికెట్స్ తీశారు.