Nobel Peace Prize Refusal: నోబెల్ శాంతి బహుమతిని వద్దు అనుకున్న ఏకైక వ్యక్తి గురించి మీకు తెలుసా.. నోబెల్ శాంతి బహుమతిని పొందాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కలలు కన్నారు. పాపం ఆయన తన కలను నిజం చేసుకోలేకపోయారు. శుక్రవారం నార్వే రాజధాని ఓస్లోలో నోబెల్ శాంతి బహుమతిని వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మారియాకు ఇస్తున్నట్లు నోబెల్ కమిటి ప్రకటించింది. గతంలో చాలా మంది ప్రముఖులు ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. కానీ నోబెల్ శాంతి బహుమతిని తిరస్కరించిన ఏకైక వ్యక్తి గురించి ఎంత మందికి తెలుసు..
READ ALSO: Kishkindhapuri: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నోబెల్‌ను తిరస్కరించిన లె డక్ థో..
1973లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా వియత్నామీస్ రాజకీయవేత్త, విప్లవకారుడు, దౌత్యవేత్త లె డక్ థోను నోబెల్ శాంతి కమిటి ప్రకటించింది. కానీ ఆయన నోబెల్ శాంతి బహుమతిని తిరస్కరించారు. నోబెల్ బహుమతుల చరిత్రలో ఈ అవార్డును స్వీకరించడానికి నిరాకరించిన ఏకైక వ్యక్తి లె డక్‌గా చరిత్ర సృష్టించారు. 1973లో నార్వేజియన్ నోబెల్ కమిటీ.. వియత్నాం యుద్ధాన్ని ముగించడానికి చేసిన కృషికి లె డక్ థో, అమెరికా విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిస్సింజర్‌లకు బహుమతిని ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది. కానీ లె డక్ థో అలా చేయడానికి గల కారణాలను చూపుతూ అవార్డును తిరస్కరించారు.
పారిస్ శాంతి ఒప్పందాలను పూర్తిగా గౌరవించి, దక్షిణ వియత్నాంలో శాంతి పునరుద్ధరిస్తేనే తాను బహుమతిని స్వీకరించడాన్ని పరిశీలిస్తానని లె డక్ నోబెల్ కమిటీకి పంపిన టెలిగ్రామ్‌లో పేర్కొన్నారు. ఎందుకంటే ఆ సమయంలో అక్కడ పారిస్ శాంతి ఒప్పందాల నిబంధనలు ఉల్లంఘించబడ్డాయని ఆయన పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్ – దక్షిణ వియత్నాం మధ్య కొనసాగుతున్న సంఘర్షణ, నిరంతర శత్రుత్వాలు ఇంకా సాధించని శాంతికి వచ్చిన బహుమతిని అంగీకరించడం అసాధ్యమని ఆయన నొక్కి చెప్పారు.
అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడిన అనుభవం ఆయన సొంతం..
అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడిన అనుభవం లె డక్ థోకు ఉంది. 1969, 1973 మధ్య హెన్రీ కిస్సింజర్‌తో వియత్నాంలో కాల్పుల విరమణపై చర్చలు జరిపారు. ఆయన యువకుడిగా ఉన్న సమయంలో కమ్యూనిస్ట్ నాయకుడు అయ్యారు. ఫ్రెంచ్ వలస అధికారుల పాలనా కాలంలో చాలా ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో వియత్నాంపై జపాన్ ఆక్రమణ సమయంలో ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారు. 1945లో జపాన్ ఓటమి తర్వాత, హో చి మిన్ వియత్నాంను స్వతంత్ర దేశంగా ప్రకటించారు. కానీ ఫ్రెంచ్ వారు తిరిగి ఈ దేశానికి వచ్చారు. ఆ సమయంలో లె డక్ థో ఫ్రాన్స్‌కు వ్యతిరేక నాయకుడిగా ఎదిగారు.
ఫ్రాన్స్ ఓటమి తరువాత వియత్నాం విభజించబడింది. ఉత్తర వియత్నాంలో కమ్యూనిస్టులు పాలనా పగ్గాలు చేపట్టగా, దక్షిణ వియత్నాంలోని ప్రభుత్వానికి అమెరికా మద్దతు ఇచ్చింది. 1968 తర్వాత అమెరికా ఇరుదేశాలతో చర్చలు జరపాలని నిర్ణయించుకున్నప్పుడు, హెన్రీ కిస్సింజర్‌తో పోటీగా లె డక్ థోను ఉత్తర వియత్నాం ప్రధాన సంధానకర్తగా నియమించారు. కిస్సింజర్ ఆదేశాల మేరకు క్రిస్మస్ సమయంలో హనోయ్ పై బాంబు దాడి జరిగినప్పుడు, లె డక్ థో కాల్పుల విరమణకు అంగీకరించారు. కానీ 1973 కిస్సింజర్‌తో కలిసి శాంతి బహుమతిని గెలుచుకున్నప్పుడు, ఆయన కాల్పుల విరమణను ఉల్లంఘించాడనే కారణంతో నోబెల్ శాంతి బహుమతిని అంగీకరించడానికి నిరాకరించి చరిత్రలో నిలిచిపోయారు. నోబెల్ బహుమతి వద్ద ఏకైక వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు.
READ ALSO: White House Reaction: నోబెల్ కమిటి శాంతి కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చింది..
