NTV Telugu Site icon

Biggest Earthquakes: అత్యంత ప్రమాదకరమైన 5 భూకంపాలు ఇవే..

Largest Earthquakes

Largest Earthquakes

Biggest Earthquakes: టర్కీ, సిరియాలను వరుస భూకంపాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. అతిపెద్ద భూకంపం సంభవించిన 12 గంటల్లోనే టర్కీ, సిరియాలో మరోసారి భూకంపం రావడం ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటికే మొదటి భూకంపం కారణంగా మృతుల సంఖ్య ఇప్పటివరకు తెలిసిన ప్రకారం.. 16 వందలకు పైగా ఉంది. ఇదిలా ఉండగా గంటల వ్యవధిలో ఆ దేశాల్లో మరోసారి భూకంపం వచ్చింది. ఇది రిక్టారు స్కేలుపై 7.6గా నమోదైంది. ఎల్బిస్తాన్ జిల్లాలో సంభవించిన ఈ భూకంపాన్ని సిటీ డిజాస్టర్ ఎజెన్సీ ధ్రువీకరించింది. సోమవారం తెల్లవారుజామున వచ్చిన భూకంపం రిక్టారు స్కేలుపై 7.8గా నమోదైంది. భూకంపం ధాటికి వేలాది భవనాలు నేలమట్టం కావడంతో టర్కీ, సిరియాలో కొన్ని ప్రాంతాల్లో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. రోడ్లకు ఇరువైపులా కూలిపోయిన భవనాల శిథిలాలే దర్శనమిస్తున్నాయి. భూకంపం వల్ల ఇళ్లు కోల్పోయిన వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తమకు కావల్సిన వారిని కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయారు.

అమెరికా జియోలాజికల్ సర్వే అంచనాల ప్రకారం మృతుల సంఖ్య 1,000-10,000 మధ్య ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 1939 తర్వాత దేశంలో ఇదే అతిపెద్ద విపత్తు అని, భూకంపంలో 2,818 భవనాలు నేలమట్టమయ్యాయని టర్కీ అధ్యక్షుడు రెకెప్ తయ్యిప్ ప్రకటించారు. ప్రపంచ దేశాలు టర్కీ, సిరియాకు సంఘీభావం ప్రకటించాయి. ఈ విపత్కర పరిస్థితిలో సాయం అందిస్తామనని చెప్పాయి. భారత్ కూడా తన వంతు సాయంగా ఎన్డీఆర్‌ఎఫ్ సహాయక బృందాలు, వైద్య బృందాలతో పాటు సహాయ సామగ్రిని టర్కీకి పంపింది. అమెరికా జియోలాజికల్‌ సర్వే ప్రకారం ప్రపంచంలో చిలీ, అలాస్కా, సుమత్ర దీవులు, జపాన్‌ దీవులు, రష్యాలో వచ్చిన కొన్ని భూకంపాలు తొమ్మిదికి పైగా తీవ్రతతో చోటుచేసుకున్నాయి. ఇక తొమ్మిదవ అతిపెద్ద భూకంపం 1950లో అస్సాం,టిబెట్‌ సరిహద్దుల్లో చోటు చేసుకొంది.

అతిపెద్ద భూకంపం ఎక్కడ సంభవించిందో తెలుసా?

చిలీలోని బయో-బయో ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 9.5 తీవ్రతతో భూమి దాదాపు 10 నిమిషాలు కంపించింది. రికార్డుల్లో నమోదైన భూకంపాల్లో ఇదే అతిపెద్దది కావడం గమనార్హం. సముద్రంలో 25 మీటర్ల ఎత్తున ఏర్పడ్డ రాకాసి అలలు దక్షిణ చిలీ, హవాయి, జపాన్‌, ఫిలిప్పీన్స్‌, తూర్పు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తీరాలను తాకాయి. ఈ భూకంపం, సునామీల్లో చనిపోయిన వారి సంఖ్య 1,000 నుంచి 6,000 మధ్య ఉంటుంది. దాదాపు నాలుగు బిలియన్‌ డాలర్ల ఆస్తినష్టం జరిగింది.

అలాస్కాలో భారీ భూకంపం
అలాస్కాలో 1964లో గుడ్‌ ఫ్రైడే రోజునే భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 9.2 తీవ్రతతో 4.38 నిమిషాల పాటు భూమి కంపించగా.. చాలా చోట్ల భూమి చీలిపోయింది. ఇళ్లు, ఇతర నిర్మాణాలు చాలా వరకు నేలమట్టం అయ్యాయి. భూకంపం కారణంగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భూకంపం నుంచి పుట్టిన సునామీ అలల కారణంగా 131 మంది మరణించారు. సునామీ అలలు పెరూ, మెక్సికో, జపాన్‌, న్యూజిలాండ్‌ దేశాలను తాకాయి. ఇప్పటి వరకు నమోదైన భూకంపాల్లో రెండో అతిపెద్దది కావడం గమనార్హం

సుమత్ర భూకంపం
2004 డిసెంబరు 26 వ సంవత్సరంలో హిందూ మహా సముద్రంలో సుమత్రా, ఇండోనేషియా దేశాలకి దక్షిణ తీరం కేంద్రంగా ఏర్పడిన సునామీ 14 దేశాల్లో సుమారు 2,30,000 మందిని పొట్టనబెట్టుకుంది. దీని పరిమాణం 9.1–9.3 గా నమోదయ్యింది. భారత భూభాగంలోని టెక్టోనిక్ ప్లేట్లు, బర్మా భూభాగానికి చెందిన టెక్టానిక్ ప్లేట్లతో రాపిడి చెందడం వల్ల సముద్రగర్భంలో భారీ భూకంపాలు ఏర్పడ్డాయి. దీని ఫలితంగా సముద్రపు అలలు సుమారు 30 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడి తీర ప్రాంతాలను ముంచి వేశాయి. ఈ విపత్తు వల్ల ఇండోనేషియా తీవ్రంగా నష్టపోయింది. శ్రీలంక, భారతదేశం, థాయ్‌లాండ్ దేశాలు కూడా ఈ భూకంపం ధాటికి నష్టపోయాయి. ప్రపంచంలోనే అత్యంత ఘోరవిపత్తుల్లో ఒకటిగా నిలిచిపోయింది. సీస్మోగ్రాఫు మీద రికార్డయిన మూడో అతి పెద్ద భూకంపం ఇది. భూమి ఇప్పటిదాకా ఏ భూకంపంలో గుర్తించనంతగా 8.3 నుంచి 10 నిమిషాల పాటు కంపించింది. భూగ్రహం మొత్తం ఒక సెంటీ మీటరు మేర వణికింది.అంతే కాకుండా ఎక్కడో దూరాన ఉన్న అలస్కాలో దీని ప్రభావం కనిపించింది. ఇండోనేషియా ద్వీపమైన సైమీల్యూ, ఇండోనేషియా ప్రధాన భూభాగం మధ్యలో కేంద్రంగా ఈ భూకంపం ఏర్పడింది.భాదితుల కష్టాలను చూసి ప్రపంచం మొత్తం మానవతా ధృక్పథంతో స్పందించి సుమారు 14 బిలియన్ డాలర్లు సహాయంగా అందజేశారు.

జపాన్‌ భూకంపం

2011లో జపాన్‌ చరిత్రలోనే అతిపెద్ద భూకంపం సంభవించింది. సునామీ సృష్టించిన విధ్వంసంలో దాదాపు 15 వేల మంది మరణించగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రాకాసి అలలు జపాన్‌ను ముంచెత్తడంతో ఇండ్లు, వాహనాలు కాగితపు పడవలుగా మారి కొట్టుకుపోయాయి. దాదాపు పది రోజులపాటు జపాన్‌ ప్రజలు తినడానికి సరైన తిండి లేక, తాగేందుకు నీరు లేక అల్లాడిపోయారు. జపాన్ తూర్పు ద్వీపకల్పంలోని ఓషికాకు 70 కిలోమీటర్ల దూరంలో 2011 లో సరిగ్గా ఇదే రోజున రిక్టర్ స్కేలుపై 9 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 24 కిలోమీటర్ల లోతులో ఉన్నది. ఈ బలమైన భూకంపం ఈశాన్య జపాన్‌ను వణికించింది. దాదాపు 20 నిమిషాల తర్వాత సునామీ అలలు ఉత్తరాన హక్కైడో, దక్షిణాన ఒకినావా దీవులను తాకాయి. దీంతో విస్తృతమైన విధ్వంసం ఏర్పడింది. ఈ సమయంలో 15,000 మందికి పైగా మరణించారు. జాతీయ పోలీసు ఏజెన్సీ ప్రకారం, ఇంకా దాదాపు 2,000 మందికి పైగా గల్లంతయ్యారు. ఇది జపాన్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపాలలో ఒకటిగా నిలిచింది. 1900 లో ఆధునిక రికార్డ్ కీపింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచంలో నాలుగో అత్యంత శక్తివంతమైన భూకంపంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

మృత్యు అలలు

1952లో రష్యాకు చెందిన కమ్చట్కా ద్వీపకల్పంలో 9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఇది దాదాపు 18 మీటర్లున్న మూడు భారీ రాకాసి అలలను పుట్టించింది. సెవెరే-కురిల్స్క్‌ ప్రాంతంపై ఇవి అధికంగా ప్రభావం చూపించాయి. భూకంపం వచ్చిన వెంటనే ఇక్కడి ప్రజలు ప్రాణభయంతో సమీపంలోని కొండలపైకి పారిపోయారు. దీంతో తొలి సునామీ అలల నుంచి తప్పించుకొన్నారు. కానీ, వీరు తిరిగి ఇళ్లకు వచ్చాక రెండో సునామీ అల విరుచుకుపడింది. ఇక్కడ నివసించే మొత్తం 6,000 మందిలో 2,336 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం సోవియట్ సర్కారు వారికి వేరేచోట పునరావాసం కల్పించింది.