NTV Telugu Site icon

RCB Fan: ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని చెప్పింది.. ఐపీఎల్ మ్యాచ్‌కు వెళ్లి బాస్‌కు దొరికిపోయింది!

Rcb Fan

Rcb Fan

RCB Lady Fan Neha Dwivedi Spotted on Live TV by Boss: ప్రస్తుతం ఐపీఎల్ 2024 మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. క్రికెట్ ప్రేమికులు అందరూ ఐపీఎల్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది తమ అభిమాన క్రికెటర్‌లను ప్రత్యక్షంగా చూసేందుకు స్టేడియంలకు వెళుతున్నారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం ఉద్యోగులు లీవ్ పెట్టి మరీ వెళుతున్నారు. కొందరు అయితే ఆరోగ్యం బాలేదని, ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని చెప్పి.. ముందుగానే ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసి స్టేడియంలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఫామిలీ ఎమర్జెన్సీ అని చెప్పిన ఓ మహిళ.. ఐపీఎల్ 2024 మ్యాచ్‌కు వెళ్లి బాస్‌కు దొరికిపోయింది.

బెంగళూరుకు చెందిన ‘నేహా ద్వివేది’ అనే ఓ మహిళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు పెద్ద అభిమాని. ఏప్రిల్ 2న చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూడ్డానికి నేహా తన బాస్‌కు ఓ అబద్దం చెప్పింది. ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని చెప్పి.. ఆఫీస్ నుంచి ముందుగానే బయటకు వచ్చి స్టేడియంకు వెళ్లింది. మ్యాచ్ జరుగుతుండగా.. స్టేడియంలో ఎంజాయ్ చేస్తున్న నేహాను కామరామెన్ చూపించాడు. అదే సమయంలో టీవీలో ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నా ఆమె బాస్ చూశాడు. తను నేహానే అని గుర్తించాడు.

Also Read: Guntur Kaaram: ‘గుంటూరు కారం’ను ఎంజాయ్‌ చేయలేకపోయా: జగపతి బాబు

మరుసటి రోజు నేహా ద్వివేదికి ఆమె బాస్ మెసేజ్ చేశాడు. మీరు బెంగళూరు అభిమాని కాదా? అని అడగ్గా.. దానికి నేహా అవును అని సమాధానం ఇచ్చింది. 16.3 ఓవర్లో కీపర్ క్యాచ్ మిస్ చేసినందుకు నువ్ నిరాశ చెందావు కదా? అని బాస్ ప్రశ్నించాడు. అనుజ్ రావత్ క్యాచ్ మిస్ చేశాడు సర్ అని నేహా రిప్లై ఇచ్చింది. నేను నిన్ను స్టేడియంలో చూశాను, అందుకేనా నువ్ నిన్న త్వరగా ఆఫీస్ నుంచి వెళ్లిపోయావ్ అని బాస్ అడగడంతో ఆమె షాక్ తింది. ఈ చాట్‌ను నేహా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ఆ మ్యాచులో లక్నో 28 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలిచింది.