Koti Deepotsavam 2026 : శ్రీహరికి మహాభిషేకం.. అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం.!

  • స్వామీజీల అనుగ్రహ భాషణం
  • శ్రీహరికి మహాభిషేకం
  • వైభవంగా శ్రీనివాస కల్యాణం
  • గరుడ వాహన సేవ, సప్తహారతులు
Day 15

Day 15

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా కార్తీక మాసం సందర్భంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం 2026 భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. ఉత్సవాల్లో భాగంగా 15వ రోజు అయిన నవంబర్ 28, శనివారం (కార్తీక బహుళ పంచమి) పలు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రముఖ స్వామీజీల అనుగ్రహ భాషణం, ప్రవచనామృతం, శ్రీహరికి మహాభిషేకం, శ్రీనివాస కల్యాణ మహోత్సవం వంటి విశేష ఘట్టాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచాయి.

అనుగ్రహ భాషణం, ఆధ్యాత్మిక ప్రవచనం

ఈ ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా బాలాపూర్‌కు చెందిన శ్రీ అవధూతగిరి మహారాజ్ స్వామీజీ, మహామండలేశ్వర్ శ్రీ సిద్ధేశ్వరగిరి మహారాజ్ స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం అష్టావధాని డా. ధూళిపాళ్ల మహాదేవమణి ఆధ్యాత్మిక ప్రవచనామృతం వినిపించి భక్తులను ఆకట్టుకున్నారు.

శ్రీనివాస కల్యాణ మహోత్సవం.. విశేష పూజలు

వేదికపై శ్రీహరికి మహాభిషేకం, అష్టదళ పాదపద్మారాధన నిర్వహించగా, భక్తులచే శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలకు కోటిపుష్పార్చన కార్యక్రమం భక్తిభావంతో సాగింది. భక్తుల సమక్షంలో శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి గరుడ వాహన సేవ నిర్వహించగా, స్వర్ణ లింగోద్భవం, సప్తహారతులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

భక్తుల ఆనందం.. నిర్వాహకుల ఆహ్వానం

కార్తీక మాసంలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమాలు భక్తులకు భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాయి. ముఖ్యంగా శ్రీనివాస కల్యాణ మహోత్సవం, గరుడ వాహన సేవతో పాటు స్వర్ణ లింగోద్భవం, సప్తహారతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి ఏడాది లాగే పూజా సామగ్రిని ఉచితంగా అందిస్తున్న రచనా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. ఈ కోటి దీప యజ్ఞంలో పాల్గొనాలని భక్తులను సాదరంగా ఆహ్వానిస్తోంది.