CII Summit: విశాఖ సీఐఐ సమ్మిట్‌లో సందడి.. పారిశ్రామికవేత్తల ఆవిష్కరణలను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్..

Ap

Ap

విశాఖపట్నంలో ఘనంగా జరుగుతున్న 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ – 2026లో భాగంగా ఏర్పాటు చేసిన “మీట్ ది ఆంధ్రప్రెన్యూర్స్” స్టాళ్లను రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సందర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్‌ను మంత్రి స్వయంగా పరిశీలించారు. ఒక్కో స్టాల్‌లో ప్రదర్శించిన వినూత్న ఉత్పత్తుల గురించి ఆరా తీశారు. వారి నూతన ఆవిష్కరణలు, వ్యాపార విస్తరణకు భవిష్యత్తులో ఉన్న అవకాశాలపై పారిశ్రామికవేత్తలతో ఆప్యాయంగా ముచ్చటించారు.
ఈ ప్రదర్శనలో మొత్తం తొమ్మిది వివిధ విభాగాల్లో పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను ప్రదర్శించి చూపించారు. ఇందులో ప్రెసిషన్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ సొల్యూషన్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, మెటీరియల్ అండ్ మొబిలిటీ సొల్యూషన్స్, అలాగే ఆర్టీఐహెచ్ ఇన్నోవేటర్స్ అరేనా విభాగాలు సమ్మిట్‌కు వచ్చే సందర్శకులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.
అదేవిధంగా అగ్రి-టెక్ అండ్ సర్క్యులర్ ఎకానమీ, ఎస్‌హెచ్‌జీ అండ్ మహిళా నేతృత్వంలోని సంస్థలు, ఫార్మా అండ్ మెడ్-టెక్, ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాల్లో మహిళా పారిశ్రామికవేత్తలతో పాటు ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలు తమ సరికొత్త ఉత్పత్తులను ప్రదర్శించి సత్తా చాటారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టేస్టింగ్ కార్నర్‌లో అరకు కాఫీ, ఆత్రేయపురం పూతరేకులు, వివిధ రకాల సాంప్రదాయ ఆంధ్ర రుచులు సమ్మిట్‌కు విచ్చేసిన దేశవిదేశీ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని ఎంఎస్‌ఎంఈ రంగమే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అసలైన వెన్నెముక అని కొనియాడారు. చిన్న పరిశ్రమలకు ప్రపంచ స్థాయి మార్కెట్ సదుపాయం, అధునాతన సాంకేతికత, తగిన పెట్టుబడులు అందించడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పెద్ద పరిశ్రమలతో చిన్న పరిశ్రమలు భాగస్వామ్యం పంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పారిశ్రామికవేత్తకు ప్రభుత్వపరంగా సంపూర్ణ అండదండలు ఉంటాయని  భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట పలువురు సీఐఐ ప్రతినిధులు, ఎంఎస్‌ఎంఈ శాఖ ఉన్నతాధికారులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.