NTV Telugu Site icon

KL Rahul-IPL 2024: ఐపీఎల్ 2024కు ముందు.. కేఎల్‌ రాహుల్‌ ప్రత్యేక పూజలు!

Kl Rahul Ipl 2024

Kl Rahul Ipl 2024

KL Rahul in Ujjain’s Mahakaleshwar Temple: ఐపీఎల్ 2024కు సమయం ఆసన్నమైంది. మార్చి 22న 17వ సీజన్ ఆరంభం కానుంది. టోర్నీ మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. మార్చి 24న రాజస్తాన్‌ రాయల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌ ద్వారా టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. గాయం నుంచి కోలుకున్న రాహుల్.. లక్నో కెప్టెన్‌ హోదాలో బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ 2024లో బరిలోకి దిగే ముందు రాహుల్ ప్రత్యేక పూజలు చేశాడు.

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ ఆలయాన్ని ఈరోజు కేఎల్‌ రాహుల్‌ దర్శించుకున్నాడు. తల్లిదండ్రులతో కలిసి ఉదయాన్నే గుడికి వెళ్లిన రాహుల్‌.. భస్మా హారతి తీసుకున్నాడు. అనంతరం మహాదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. పండితుల ఆశీర్వచనాలు పొందాడు. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న రాహుల్.. ఐపీఎల్‌లో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో విరాట్‌ కోహ్లీ కూడా ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని దర్శించుకున్నాడు.

Also Read: IPL 2024: ఇన్నాళ్లు ఆటకు దూరమైనా.. ఫామ్‌లోనే ఎంఎస్ ధోనీ! హెలికాఫ్టర్ షాట్స్ వీడియో వైరల్

గతేడాది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌ సందర్భంగా కేఎల్‌ రాహుల్‌ గాయపడ్డాడు. దాంతో ఐపీఎల్‌ 2023లో కీలక మ్యాచ్‌లకు దూరమయ్యాడు. రాహుల్ స్థానంలో లక్నో పగ్గాలు చేపట్టిన కృనాల్‌ పాండ్యా జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. అయితే నాకౌట్ మ్యాచ్‌లో చేతులెత్తేసిన లక్నో.. ఇంటిదారి పట్టింది. తొడ కండరాల గాయానికి శస్త్ర చికిత్స చేసుకున్న రాహుల్‌.. వన్డే ప్రపంచకప్‌ 2023లో కీపర్‌గానూ రాణించాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో అతడికి మళ్లీ గాయం తిరగబెట్టింది. దాంతో లండన్‌ వెళ్లి వైద్య నిపుణులను సంప్రదించాడు. అనంతరం ఎన్‌సీఏలో పునరావాసం పొందిన రాహుల్.. తాజాగా ఫిట్‌నెస్‌ సాధించాడు.