NTV Telugu Site icon

Star Cricketer Wife: స్టార్ క్రికెటర్ భార్యకు చేదు అనుభవం.. వెంటపడి వేధించిన యువకులు

Nitish Rana

Nitish Rana

Star Cricketer Nitish Rana Wife: కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌, స్టార్‌ క్రికెటర్‌ నితీష్ రాణా భార్యకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తోన్న కారును ఇద్దరు యువకులు బైక్‌పై వెంటాడారు. కారుకు పదే పదే అడ్డుపడ్డారు. సాచిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఈ ఘటన ఈ నెల 4వ తేదీన రాత్రి న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఢిల్లీ పోలీసుల నుంచి తనకు ఎలాంటి సహాయం అందలేదని చెప్పారు. ఇదిలా ఉండగా.. క్రికెటర్ నితీష్ రాణా భార్యను శుక్రవారం ఢిల్లీలో ఇద్దరు వ్యక్తులు వెంబడించి వేధించినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు.

నితీష్ రాణా భార్య పేరు సాచి మర్వా.. ఆమె వృత్తి రీత్యా ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. ఆమె స్వస్థలం ఢిల్లీ. గుర్‌గావ్‌లోని సుశాంత్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్‌లో ఇంటీరియర్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఎంటీవీ నిర్వహించిన రోడీస్, కోక్ స్టూడియోస్, మ్యాన్ వర్సెస్ వైల్డ్.. వంటి కొన్ని టీవీ షోస్‌లల్లో మెరిశారు. 2019 ఫిబ్రవరి 19వ తేదీన నితీష్ రాణాను పెళ్లి చేసుకున్నారు. నితీష్ రాణా కుటుంబం ఢిల్లీలోనే నివసిస్తోంది. ఈ నెల 4వ తేదీన రాత్రి కారులో ఇంటికి బయలుదేరి వెళ్తోండగా.. ఢిల్లీలోని కీర్తినగర్ ప్రాంతంలో ఇద్దరు యువకులు బైక్‌పై వెంబడించారు. కారును అడ్డుకోవడానికి పదేపదే ప్రయత్నించారు. ఒక దశలో బైక్‌తో కారును ఢీ కొట్టారు కూడా. గట్టిగా అరుస్తూ సాచి మర్వాను ఇబ్బంది పెట్టారు. సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం పాటు వారు సాచి మార్వా కారును వెంబడించినట్లు చెబుతున్నారు.

Read Also: Harassment: దారుణం.. చాక్లెట్ల ఆశచూపి నాలుగేళ్ల చిన్నారిని నిర్జన ప్రదేశానికి లాక్కెళ్లి..

తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని సాచి మర్వా.. తన ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్ట్ చేశారు. కారును వెంబడించిన ఆ ఇద్దరి ఫొటోలను షేర్ చేశారు. అకారణంగా వారు తనను వెంబడించారని, కారును ఢీ కొడుతూ ఇబ్బంది పెట్టారని, తనను ఇబ్బందులకు గురి చేశారనీ అన్నారు. ఆ విషయంపై తాను పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. వారు పట్టించుకోలేదని సాచి మర్వా పేర్కొన్నారు. సేఫ్‌గా ఇంటికి వెళ్లారు కదా?.. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలంటూ ఢిల్లీ పోలీసులు సూచించినట్లు చెప్పారు. ఇంకోసారి అలాంటి సందర్భం ఎదురైతే వెహికల్ నంబర్‌ను నోట్ చేసుకోవాలని వారు సలహా ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఈ సమాచారాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వెంటనే పలువురు అభిమానులు రిప్లై ఇచ్చారు. ఓ మహిళను వేధించిన ఘటనలో పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని స్పష్టం చేస్తోన్నారు.