Kishan Reddy: బీజేపీ పార్టీ ఎన్నడూ ఓట్లను చోరీ చేయదు, దేశ ప్రజల మనసులను గెలుచుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిస్తే తమ ఘనతగా చెప్పుకోవడం, ఓడిపోతే ఈవీఎంలు, ఎన్నికల సంఘంపై నిందలు వేయడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు, ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రసంగించారు. ఎన్నికల సంఘం, రాజ్యాంగ వ్యవస్థలపై రాహుల్ గాంధీ చేస్తున్న నిరాధార ఆరోపణలను ఖండించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం బాగానే పనిచేసినట్లు ప్రచారం చేసుకుని, ఇతర రాష్ట్రాల్లో బీజేపీ గెలిస్తే మాత్రం ఈవీఎంలు, ఎన్నికల సంఘం తప్పన్నట్లు మాట్లాడటం వారి అపరిపక్వతకు నిదర్శనమన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాల్సిన బాధ్యత ఈవీఎంలకు లేదని స్పష్టం చేశారు. 1975లో ఎమర్జెన్సీ విధించి పౌరహక్కులను కాలరాసిన చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కు రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే సీఎం రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు వెళ్లి “సోనియా గాంధీ కుటుంబం కోసం ప్రాణాలు అర్పిస్తా” అనడం సిగ్గుచేటని, ప్రజల సమస్యలను గాలికొదిలేసి గాంధీ కుటుంబ సేవలోనే గడుపుతున్నారని ఆక్షేపించారు. ఆర్మీ చీఫ్, సర్జికల్ స్ట్రైక్స్, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్, లోక్‌సభ స్పీకర్, సీజేఐ, ఈడీ, సీబీఐ, పార్లమెంట్, జీఎస్టీ వంటి రాజ్యాంగ, భద్రతా వ్యవస్థలన్నింటిపై రాహుల్ గాంధీ అనుమానాలు వ్యక్తం చేస్తూ విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని తమ కుటుంబమే పాలించాలనే రాచరికపు అహంకారం రాహుల్ మాటల్లో కనిపిస్తోందన్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని, పేదరిక నిర్మూలన, మౌలిక వసతులు, ఉచిత రేషన్ వంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో మార్పు తెచ్చిందని చెప్పారు. గత 11-12 ఏళ్ల మోడీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని తెలిపారు. స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకునే ప్రజలు బీజేపీని ఆశీర్వదిస్తున్నారని, కాంగ్రెస్ ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) గురించి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే చనిపోయినవారు, వలస వెళ్లినవారు, డూప్లికేట్ ఓట్లతో సహా లక్షలాది అక్రమ ఓట్లను తొలగించడం జరుగుతోందని తెలిపారు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దితే స్వాగతించాల్సింది పోయి రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం మానుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. అంతకుముందు, భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా పూర్తయినందుకు ఉత్సవ సమితికి, పోలీసు, మున్సిపల్ సిబ్బందికి, నగర ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

