దేశ భవిష్యత్తుకు పెను సవాలుగా మారిన డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంకణం కట్టుకున్నారని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. కింగ్ కోఠిలోని భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో ‘జైన్ జాగృతి సెంటర్’ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టాండప్ కామెడీ , కాన్సెప్చువల్ షో కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న మన దేశంలో మాదకద్రవ్యాలు యువశక్తిని నిర్వీర్యం చేస్తూ వారిని పక్కదారి పట్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదాన్ని గుర్తించిన ప్రధాని మోదీ డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించారని తెలిపారు. గతంలో ఆర్టికల్ 370, ‘సర్జికల్ స్ట్రైక్’.. తరహాలోనే ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకొని విజయవంతం చేసిన మోదీ గారు, ఇప్పుడు దేశం నుంచి డ్రగ్స్‌ను పూర్తిగా తరిమికొట్టే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని అన్నారు. ప్రధాని పిలుపు మేరకు, డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో భాగంగా ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్ నగరంలో ‘నషా ముక్త్ భారత్’ (Nasha Mukt Bharat) పేరిట మూడు రోజుల పాటు భారీ అవగాహన నడక (హైదరాబాద్ వాక్) నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం జరిగే ఈ బృహత్తర కార్యక్రమంలో యువత, నగర ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

