Kishan Reddy Announces Nasha Mukt Bharat Padyatra: దేశంలో డ్రగ్స్ మహమ్మారి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మాదకద్రవ్యాల వినియోగం యువత జీవితాలను, దేశ అభివృద్ధిని దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రేపటి (నవంబర్ 25) నుంచి మూడు రోజుల పాటు ‘నషా ముక్త్ భారత్’ పాదయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో డ్రగ్స్ సమస్య ఒకటని పేర్కొన్నారు.
‘దేశంలో ఎక్కడ చూసినా యువత డ్రగ్స్‌కు బానిసలయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఒకప్పుడు ఎంతో గొప్పగా ఉన్న పంజాబ్ రాష్ట్రం డ్రగ్స్ మహమ్మారి కారణంగా నిర్వీర్యమవుతోంది. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కూడా ఈ సమస్య విస్తరించింది. ఇప్పటికైనా అప్రమత్తం కాకపోతే దేశ అభివృద్ధితో పాటు యువత భవిష్యత్తును కాపాడుకోవడం కష్టమవుతుంది. డ్రగ్స్ తీసుకోవడం వల్ల వ్యక్తులు విచక్షణ కోల్పోయి కుటుంబాలకు, సమాజానికి భారంగా మారుతున్నారు. మాదకద్రవ్యాల విక్రయం ద్వారా వచ్చే డబ్బును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు, ఉగ్రవాదానికి సహాయం అందించేందుకు ఉపయోగిస్తున్నారు. న్యూక్లియర్ కుటుంబాల పెరుగుదల, యువత స్వేచ్ఛను కోరుకునే ధోరణి కూడా డ్రగ్స్ వినియోగం పెరగడానికి కారణాలుగా మారుతున్నాయి’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
తెలంగాణలో డ్రగ్స్‌ను అరికట్టేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను కిషన్ రెడ్డి ప్రశంసించారు. ముఖ్యంగా ఈగల్ టీమ్‌లు బాగా పనిచేస్తున్నాయని, అయితే వాటి కార్యకలాపాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. డ్రగ్స్ సమస్య చాలా పెద్దదని, దీనిని పూర్తిగా నియంత్రించేందుకు 2029 చివరి వరకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. విదేశాల నుంచి దేశంలోకి డ్రగ్స్ రాకుండా అడ్డుకునేందుకు ఆయా దేశాలతో భారత్ ఒప్పందాలు చేసుకుంటోందని తెలిపారు. భారత నిఘా సంస్థలు కూడా ఆయా దేశాలకు వెళ్లి డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటున్నాయని ఆయన వివరించారు.
యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో తగినన్ని క్రీడా మైదానాలు లేవని పేర్కొంటూ, రాష్ట్ర ప్రభుత్వం కొత్త క్రీడా మైదానాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. యువతకు క్రీడలు, ఆరోగ్యకరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెంచడం ద్వారా డ్రగ్స్ వంటి వ్యసనాల నుంచి వారిని దూరంగా ఉంచవచ్చని ఆయన పేర్కొన్నారు. ‘నషా ముక్త్ భారత్’ పాదయాత్ర బుధవారం అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్ నుంచి ప్రారంభమై.. 27వ తేదీ సాయంత్రం వరకు కొనసాగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఫిల్మ్‌నగర్‌లో పాదయాత్ర ముగుస్తుందని చెప్పారు. ఇది మొదటి విడత కార్యక్రమమని, రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పోలీస్ కమిషనర్‌తో పాటు ఉన్నతాధికారులను కూడా ఆహ్వానించినట్లు వెల్లడించారు.

