NTV Telugu Site icon

Guntur Kidnap Mystery: తెనాలిలో కిడ్నాప్ కలకలం.. 60 లక్షలు ఇస్తేనే

Gnt Kidnap Kalakalam (1)

Gnt Kidnap Kalakalam (1)

గుంటూరు జిల్లా తెనాలిలో కిడ్నాప్ కలకలం రేపింది. సినీ ఫక్కీలో దుండగులు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. వడ్డీకి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడంతో రెక్కీ నిర్వహించి సినిమా తరహాలో కిడ్నాప్ చేసిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం 7 గంటల నుంచి 9:30 గంటల వరకు ఈ ఘటన కొనసాగింది. పట్టణంలోని స్వర్ణముఖి టవర్స్ కోగంటి అపార్ట్మెంట్లో హైడ్రామాతో కూడిన కిడ్నాప్ ఆ ప్రాంతాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. పోలీసుల ఒత్తిడి వల్ల కిడ్నాప్ చేసిన వ్యక్తులే మూడవ పట్టణ పోలీసు స్టేషన్ వద్ద వదిలి వెళ్లారని బాధితుడు బాబ్జి వెల్లడించారు.

శనివారం రాత్రి 7 గంటల సమయంలో స్వర్ణముఖి అపార్ట్మెంట్స్ దగ్గర నలుగురు వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. 7.15 నిమిషాలకు అపార్ట్మెంట్స్ బయట కారు నిలిపి కారు తిరిగి వెళ్లడానికి మార్గాలను నిర్ణయించుకున్నారు. 8 :15 నిమిషాలకు కారుతో అపార్ట్మెంట్ లోకి ప్రవేశించి పార్కింగ్ ప్రదేశంలో నిలిపారు. అక్కడ వాచ్ మెన్ గా పనిచేస్తున్న ఏలియ్య అక్కడున్న వ్యక్తులను ఎందుకు వచ్చారని ప్రశ్నించగా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ చుక్కపల్లి వెంకటేశ్వరరావు కోసం వచ్చామని తెలిపారు.

ఉదయాన్నే తమ బంధువులకు అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రికి వెళ్లిన బాబ్జి రాత్రి 9:15 నిమిషాలకు తమ అపార్ట్మెంట్ కి ద్విచక్ర వాహనంపై వచ్చి.. లిఫ్ట్ మార్గం గుండా తమ ఫ్లాట్ 404కి వెళ్లే క్రమంలో నలుగురు దుండగులు ఒక్కసారిగా బాబ్జిని గట్టిగా పట్టుకొని మెడకు తాడులు వేసి గట్టిగా లాగి కారులో వేసుకుని అక్కడ నుంచి అతివేగంగా పరారయ్యారు. పెద్దగా కేకలు వినిపించడంతో ఏం జరిగిందో తెలియని స్థానికులు.. పార్కింగ్ ప్రదేశానికి రాగా అప్పటికే కారు వేగంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విషయం తెలుసుకున్న స్థానికులు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 40 గదులుగల అపార్ట్మెంట్ కు సీసీ కెమెరాలు పనిచేయకపోవడం గమనార్హం.

తెనాలి పట్టణానికి చెందిన గల్లా శ్రీనివాస్ అనే న్యాయవాదికి.. వైసీపీ ప్రచార కమిటీ సభ్యుడు, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారి కోగంటి బాబ్జి అనే వ్యక్తి నాలుగేళ్ళ క్రితం 10 లక్షలు వడ్డీకి ఇచ్చాడు. అది నేటికి పెరిగి 25 లక్షలు అయింది. గల్లా శ్రీనివాస్ అప్పు తీసుకోవడానికి తమ స్నేహితుడి పొలాన్ని తనఖాగా పెట్టాడు. సంవత్సరాలు తరబడి సమయం గడిచిపోవడంతో తనఖా పెట్టిన పొలాన్ని బాబ్జి అమ్మేశాడు. ఆ కక్షతో శ్రీనివాస్ తన మేనల్లుడుతో నకిలీ నోటుపై ఫోర్జరీ సంతకం ద్వారా బాబ్జి పై కేసు వేయించాడని బాబ్జి తెలిపారు. అదే తరహాలో మరో రెండు కేసులు వేయించారన్నారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి తమపై గల్లా శ్రీనివాస్ అనే వ్యక్తి కిడ్నాప్ పన్నాగం పన్ని తమను అపహరించారని బాబ్జి స్పష్టం చేశారు. బాబ్జిని తమ అపార్ట్మెంట్ నుంచి ఎడ్లపల్లి మార్గం గుండా కొల్లూరు మండలంలోని పెసర్లంక గ్రామంకి ఇటుక రాళ్ళబట్టి వద్దకు తీసుకువెళ్లి 60 లక్షల రూపాయలు ఇస్తే తప్పా.. ప్రాణాలతో వదలమని డిమాండ్ చేశారు. చంపేస్తామని బెదిరించారు. పోలీసులు ఒత్తిడి వల్లే తాను బతికి బట్టకట్టానని బాబ్జి వెల్లడించారు. తాను తిరిగి రావడానికి సహకరించిన పోలీసులకు, మిత్రులకు బాబ్జి ధన్యవాదాలు తెలిపారు. కిడ్నాప్ కథ సుఖాంతం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Hyderabad Rains : భాగ్యనగరాన్ని వీడనంటున్న వరుణుడు..