Deputy Tahsildar: దారుణ ఘటన.. ఖమ్మం జిల్లా డిప్యూటీ తహశీల్దార్ ఆత్మహత్య..

Suicide

Suicide

మహబూబాబాద్ పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలో గ్రూప్-2 కేడర్ లో డిప్యూటీ తహశీల్దార్‌గా శిక్షణ పొందుతున్న డోలి సంధ్య (28) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. మహబూబాబాద్ పట్టణంలోని సీతాకోకచిలుకల సెంటర్ సమీపంలో నివసించే డోలి వెంకటేశ్వర్లు, పద్మ దంపతుల చిన్న కుమార్తె అయిన సంధ్య, ప్రతిభావంతురాలైన అధికారిణిగా పేరుపొందారు. సంధ్య గతంలో గ్రూప్-4 పరీక్షలో విజయం సాధించి మహబూబాబాద్ మున్సిపాలిటీలో సేవలు అందించారు. ఆ తర్వాత ఆమె గ్రూప్-2 ఉద్యోగానికి ఎంపికై డిప్యూటీ తహశీల్దార్‌గా ఉద్యోగం పొందారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా రెవెన్యూ శాఖలో ట్రైనీ డిప్యూటీ తహశీల్దార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె, ఇటీవల సెలవుపై మహబూబాబాద్‌లోని తన స్వగృహానికి వచ్చారు.

ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయాన్ని చూసి సంధ్య ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విచారంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే సంధ్య ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆమె మృతిపై తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బంధువుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. సంధ్య ఆత్మహత్యకు గల అసలు కారణాలు, మానసిక ఒత్తిళ్లా లేదా ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు పోలీసుల పూర్తిస్థాయి దర్యాప్తులో వెల్లడికానున్నాయి.