Khairatabad Ganapathi Shobha Yatra: ఖైరతాబాద్ మహాగణపతిని టస్కర్ పైకి చేరి శోభాయాత్రకు బయలు దేరాడు. అధికారులు మధ్యాహ్నం 2 గంటల్లోపు గణేశుడి నిమజ్జనం పూర్తయ్యేలా ప్రణాళిక చేస్తున్నారు. స్వామితో పాటు ఎటువంటి డీజే వాడకుండా, కేవలం సన్నాయి మేళాల మధ్యనే ఖైరతాబాద్ గణేషుడిని గంగమ్మ వాడికి చేర్చనున్నారు. ఇక ఈ భారీ గణేషుడిని ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నంబర్ – 5 వద్ద నిమజ్జనం చేసేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
నిజానికి ఉదయం 6 గంటలకు మొదలవ్వాల్సిన బడా గణపతి శోభాయాత్రకు.. గణేశ్‌ను లిఫ్ట్ చేసే క్రేన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆలస్యమైంది. సాంకేతిక లోపాన్ని పరిష్కరించి గణేశ్‌ను టస్కర్ పైకి చేర్చి ఎట్టకేలకు భక్తుల కోలాహలంతో శోభాయాత్ర మొదలైనది. భారీ గణేషుడిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. మరోవైపు హైదరాబాద్ తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్ వద్ద భక్తుల సందడి భారీగా ఉంది.
ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనానికి పెద్దసంఖ్యలో గణనాథులు చేరుకుంటున్నారు. దీనితో పెద్దసంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు. భక్తులు భారీగా రావడంతో పోలీసులు అడుగడుగున భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.

