NTV Telugu Site icon

Arif Mohammed Khan: రామ్ లల్లాను దర్శించుకున్న కేరళ గవర్నర్ ఆరీఫ్ ఖాన్..

Jai Sri Ram

Jai Sri Ram

కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ అయోధ్య రామయ్యను దర్శించుకున్నారు. తొలుత నిలబడి ఆపై మోకాళ్లపై కూర్చొని మొక్కుకున్నారు. అనంతరం తలను నేలకు ఆన్చి ప్రణమిల్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేరళ రాజ్ భవన్ కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’లో షేర్ చేసింది. అందులో రామ్ లల్లా విగ్రహం ముందు కూర్చొని ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ మొక్కుతుండగా వెనుక నుంచి జై శ్రీరాం నినాదాలు వినిపించాయి. ఈ సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరాముడిని ఆరాధించడం గర్వకారణమన్నారు. తాను గత జనవరిలో రెండుసార్లు అయోధ్యకు వచ్చారని.. ఆ సమయంలో ఉన్న అనుభూతి నేటికీ అలాగే ఉందని తెలిపారు. అయోధ్యకు వచ్చి శ్రీరాముని పూజించడం గర్వించదగ్గ విషయమన్నారు.

READ MORE: Elections 2024: తెలంగాణ నుంచి సొంతూళ్లకు ఓటర్లు.. నెల క్రితమే రిజర్వేషన్లు..

సాధారణంగా ఇస్లాంలో విగ్రహారాధన నిషిద్ధం అని అంటారు. కానీ, ఆరీఫ్ ఖాన్ శ్రీరాముడిని ఇలా దర్శించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయినా ఆరీఫ్ ఖాన్ చాలా కాలంగా ఇస్లాంలో సంస్కరణల కోసం పోరాడుతున్నారు. కాబట్టి, ఆయన శ్రీరాముడ్ని అలా దర్శించుకోవడంలో ఆశ్చర్యం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్యను సందర్శించిన వారం రోజుల తర్వాత కేరళ గవర్నర్ ఇప్పుడు దర్శించుకున్నారు. ముర్ము గిరిజనులు అయినందున రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు ఆమెను ఆహ్వానించలేదని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆరీఫ్ ఖాన్ తప్పుబట్టారు. మరోవైపు, అయోధ్య మందిరాన్ని హిందువులే కాకుండా ఇతర మతాలకు చెందిన వారు కూడా దర్శించుకుంటున్నారు. గత ఫిబ్రవరిలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా అయోధ్య మందిరాన్ని సందర్శించారు. ఈయన సిక్కు మతానికి చెందిన వారు. పాకిస్ఠాన్ నుంచి దాదాపు 250 మందికి పైగా హిందువులు, సింధ్ నుంచి వచ్చి రామ్ లల్లా దర్శనం చేసుకున్నారు. వీరు గత శుక్రవారం అయోధ్యకు వచ్చారు. ఈ వ్యక్తులు సింధ్ ప్రావిన్స్‌లోని 34 జిల్లాలకు చెందినవారని ఆలయ అధికారులు తెలిపారు.