MLC Kavitha: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నేడు (జులై 26) కొంపల్లి శ్రీ కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్న లీడర్ శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. జాగృతి కార్యకర్తలకు మానవీయ, సామాజిక బాధ్యతలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అలాగే నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలో ఆమె వివరంగా తెలిపారు.
నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత పెద్ద వ్యవస్థతోనైనా, ఎంతటి పెట్టుబడి వ్యవస్థతోనైనా జాగృతి నిలబడి పోరాడింది అని కవిత పేర్కొన్నారు. జాగృతి లాంటి సంస్థలు తరచూ పుట్టవు, పుట్టినవి చరిత్రలో నిలవడం చాలా అరుదు అని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక సంస్థ మాత్రమే కాక, ఒక ఉద్యమంగా ప్రజలలో పెంపొందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోందని చెప్పారు. అలాగే, నాయకత్వం అంటే హోదా కాదు.. ప్రజా స్పృహ అని పేర్కొన్నారు. ఇంట్లో ఉండే ఇల్లాలు మొదటి లీడర్.. అని మహిళలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఇంట్లో ప్రతి ఒక్కరి అవసరాలను ముందుగా గుర్తించి, తగినంత జాగ్రత్త తీసుకునే మహిళలే నిజమైన నాయకులు అని చెప్పుకొచ్చారు. అదే విధంగా, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని.. పరిష్కార మార్గాలు అన్వేషించే వాడే నిజమైన నాయకుడని ఆమె అభిప్రాయపడ్డారు.
సామాజిక స్పృహే మంచి నాయకుడి ప్రథమ లక్షణమని కవిత అన్నారు. మన ఇంట్లో ఉన్న చెత్తను పక్కింట్లో వేయకుండా చూసుకోవడమే సామాజిక స్పృహ అంటూ ఉదాహరణతో వివరించారు. జాగృతి కార్యకర్తలు ఈ స్పృహతో సేవా మార్గంలో ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. బయట కొన్ని విమర్శలు, అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, జాగృతి కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. వల్గర్ భాషను వాడకుండా, విషయపరమైన పదునైన సమాధానాలు ఇవ్వగలిగినవారే నిజమైన నేతలు అవుతారని వివరించారు. మహాత్మా గాంధీ చెప్పిన అహింసా సిద్ధాంతాన్ని పాటించాలనీ, ధైర్యానికి ఉదాహరణగా సుభాష్ చంద్రబోస్ ని మనసులో ఉంచుకోవాలని సూచించారు.
PM Modi: మరోసారి అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రజాస్వామ్య నేతగా మోడీ రికార్డ్.. టాప్-5లో కనపడని ట్రంప్..!
ఈ శిక్షణ కార్యక్రమం ఏ ప్రయోజనాల కోసం కాదని, కేవలం సమాజానికి మంచి నాయకత్వం అందించాలనే దృష్టితోనే జరుపుతున్నామని ఆమె స్పష్టం చేశారు. ఎవరైనా నాయకత్వం పొందాలనుకుంటే.. జాగృతి వాళ్ల వెంట నిలుస్తుందని స్పష్టం చేశారు. బడుగు, బలహీన, అట్టడుగు వర్గాల మహిళలు, యువత రాజకీయంగా ఎదగడానికి జాగృతి ఒక గొప్ప వేదికగా మారుతుందని ఆమె పేర్కొన్నారు.
