Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!

Kavitha1

Kavitha1

Kavitha: వేములవాడ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు ‘కవిత’ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యలను ఆమె ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం, టీఆర్ఎస్ పార్టీ బాగుండాలని రాజన్నను వేడుకున్నట్లు ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు.

వేములవాడ రాజన్న ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని.. ఆలయానికి ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించడంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయని, ఎవరు నిధులు ఇచ్చినా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఆలయ నిర్మాణంలో కాంక్రీట్‌కు బదులుగా కృష్ణశిలను ఉపయోగించాలని ఆమె కోరారు. రాజన్న ఆలయంలో కోడెలు మృతి చెందుతున్నా రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి బండి సంజయ్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

వేములవాడలో రోడ్లు, మార్కెట్, డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని కవిత పేర్కొన్నారు. చేపట్టిన పలు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని, రైతుల కోసం సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వేములవాడ పట్టణంలో దుమ్ము సమస్య తీవ్రంగా ఉందని, డ్రైనేజీ పనులపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని కోరారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.

రాజన్న చెరువు ప్రక్షాళన కోసం విప్ ఆది శ్రీనివాస్ నిధులు తీసుకురావాలని కవిత డిమాండ్ చేశారు. గతంలో కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో సిరిసిల్లను అభివృద్ధి చేశారని, ప్రస్తుతం వేములవాడ అభివృద్ధి బాధ్యతలు చూస్తున్న ఆది శ్రీనివాస్ నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. అధికార దర్పం కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించారు. తన తల్లిదండ్రుల వివాహం కూడా వేములవాడలోనే జరిగిందని కవిత గుర్తుచేశారు. ఈ ప్రాంతంతో తమ కుటుంబానికి అనుబంధం ఉందన్నారు.

వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు నీటి బొట్టు కూడా రాలేదని ఆమె విమర్శించారు. గత ప్రభుత్వంలో మంత్రి హరీశ్‌రావు చెప్పిన ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని కోరారు. రుద్రంగి వద్ద రూ.200 కోట్లతో 2.5 టీఎంసీల రిజర్వాయర్ నిర్మిస్తామని గతంలో చెప్పారని, ఆ హామీ ఏమైందని కవిత ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ ప్రాంత రైతులకు ప్రయోజనం కలగడం లేదని అన్నారు. రైతుల కోసం మంత్రి బండి సంజయ్, ఆది శ్రీనివాస్ తమ పలుకుబడిని ఉపయోగించి రుద్రంగి, ధూంపేట తదితర ప్రాంతాల్లోని చెరువులకు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

రైతులకు నిరంతర విద్యుత్ అందించాలని కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్‌ను కొనుగోలు చేస్తుందో, అడుక్కుంటుందో తమకు తెలియదని, కానీ రైతులకు మాత్రం కరెంట్ అందాల్సిందేనని అన్నారు. ప్రజా సమస్యలపై టీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. సిరిసిల్లకు ముఖ్యమంత్రి ఏదో ఒక భారీ ప్రకటన చేస్తారని భావించినప్పటికీ, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కవిత విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అభివృద్ధికి సంబంధించి ఎలాంటి కీలక ప్రకటన చేయలేదన్నారు. సిరిసిల్లలో గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని గతంలో చెప్పారని, అయితే ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉందని వ్యాఖ్యానించారు.

సీఎం రేవంత్‌రెడ్డికి రాజకీయాలు చేయడం తప్ప అభివృద్ధి చేయడం తెలియదని కవిత విమర్శించారు. రైల్వే లైన్ పనులు కూడా అక్కడక్కడ నిలిచిపోయాయని, వాటిని పూర్తి చేయాలని టీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తామని తెలిపారు. గల్ఫ్ కార్మికులకు అన్యాయం జరుగుతోందని, గల్ఫ్ అడ్వైజరీ కమిటీ నుంచి సభ్యులు తప్పుకుంటున్నారని అన్నారు. సిరిసిల్ల జేఎన్‌టీయూ విద్యార్థులు ల్యాబ్ సౌకర్యాల కోసం జగిత్యాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని కవిత పేర్కొన్నారు. మెడికల్ కళాశాలలోనూ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎమ్మెల్యే కేటీఆర్, ఆది శ్రీనివాస్, బండి సంజయ్ స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.

సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్)కు దేశంలోనే ప్రత్యేక చరిత్ర ఉందని కవిత అన్నారు. సెస్‌ను ఎన్‌పీడీసీఎల్‌లో విలీనం చేసిన తర్వాత విద్యుత్ పోల్‌ దెబ్బతిన్నా పట్టించుకునే వారు లేకుండా పోయారని ఆరోపించారు. సెస్‌లో గతంలో అవినీతి జరిగిందని, ఫైర్ ప్రమాదంలో కీలక ఫైల్స్ కాలిపోయాయని ఆమె వ్యాఖ్యానించారు. నేరెళ్ల బాధితుల ఫైల్స్ కూడా కాలిపోయాయని కవిత ఆరోపించారు. సీఎం సిరిసిల్ల సభలో నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా టీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని తెలిపారు.

కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యల మధ్య పొంతన లేదని కవిత విమర్శించారు. రేవంత్‌రెడ్డి పదేళ్లు తానే సీఎంగా ఉంటానని చెబుతుంటే, మరోవైపు బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని పార్టీ నేతలు చెబుతున్నారని అన్నారు. ఈ పరిణామాలను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్ మధ్య “విడాకులు అయ్యాయి” అంటూ కవిత వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో జర్నలిస్టులకు కూడా అన్యాయం జరుగుతోందని కవిత ఆరోపించారు. ముఖ్యంగా ముస్లిం జర్నలిస్టులకు అక్రిడిటేషన్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు.

మాజీ మావోయిస్టులు టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని కవిత పిలుపునిచ్చారు. వారిని పార్టీలోకి స్వాగతిస్తామని, మావోయిస్టుల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కవిత అన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ విద్యా రంగంపై నియంత్రణ తీసుకొస్తామని, ప్రస్తుతం ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇంకా ముంపు గ్రామాల సమస్యలపైనా పోరాటం చేస్తామని కవిత అన్నారు. వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల ప్రజా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.