తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, నటుడు విజయ్ కరూర్‌లో నిర్వహించిన ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటపై నకిలీ వార్తలు ప్రచారం చేసిన యూట్యూబర్ ఫెలిక్స్ జెరాల్డ్‌ను తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెడ్‌పిక్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్న జెరాల్డ్.. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఫేక్ కంటెంట్‌ను తన ఛానల్‌లో ప్రచారం చేశారు. టీవీకే పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నాడని ఫిర్యాదులు అందడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జెరాల్డ్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు.
Also Read: Gold Rate Today: పండుగల వేళ బిగ్ షాక్.. వందలు కాదు వేలల్లో పెరుగుదల! తులం ఎంతో తెలిస్తే షాకే
కరూర్ తొక్కిసలాట ఘటనపై తప్పుడు ప్రచారాలు చేసిన మరో 25 మందిపై కూడా కేసులు నమోదు అయ్యాయి. వారిని పోలీసులు కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది. ప్రజాశాంతికి భంగం కలిగించడం, ఉద్రిక్తతలను రేకెత్తించేలా సోషల్ మీడియాలో కంటెంట్ షేర్ చేసినందుకు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం విజయ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 110 మంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. నిన్న 51 మంది డిశ్ఛార్జి అయ్యారు. చికిత్స పొందుతున్న వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది.
