కార్తిక మాసంలో వచ్చే చివరి రోజును పోలి పాడ్యమి (పోలి స్వర్గం) అంటారు. ఈరోజు మహిళలందరూ తెల్లవారుజామున పుణ్యస్నానాలు ఆచరించి.. చెరువులు, నదులలో దీపాలు వదులుతారు. అదే సమయంలో పోలి కథను కూడా చదువుకుంటారు. నేడు పోలి పాడ్యమి కావడంతో రాజమండ్రిలోని గోదావరి స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులు గోదావరిలో పోలి పాడ్యామి స్నానాలు ఆచరిస్తున్నారు.
భక్తుల పుణ్యస్నానాలతో రాజమండ్రిలోని పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్లు కిక్కిరిపోయాయి. స్నానాలు ఆచరించిన మహిళలు గోదావరి నదిలో 30 ఒత్తులతో (కార్తీక మాసంలోని ఒక్కో రోజుకు ఒక్కో దీపం) కార్తీక దీపాలు వదులుతున్నారు. భక్తుల శివ నామస్మరణతో ఘాట్లు మార్మోగిపోతున్నాయి. గోదావరి నది తీరం శివాలయాల్లో పరమేశ్వరుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీతో స్నాన ఘట్టాలు, శివాలయాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా మున్సిపల్ కార్పోరేషన్ శానిటరీ సిబ్బంది ఘాట్లను శుభ్రపరిచారు.