NTV Telugu Site icon

Money Found On Tree: మామిడి చెట్టుపై నోట్ల కట్టలు.. కోటి రూపాయలను జప్తు చేసిన ఐటీ

Money

Money

Money Found On Tree: మరో వారం రోజుల్లో కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఇదే సమయంలో కోట్ల కొద్దీ డబ్బులు చేతులు మారుతున్నాయి. ఇప్పటిదాకా రూ.300 కోట్లకు పైగా లెక్క చూపని డబ్బును ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంది. ఇందులో ఒక్క బెంగళూరులోనే రూ.82 కోట్లను స్వాధీనం చేసుకుంది.

తాజాగా మైసూరులో ఓ వ్యక్తి ఇంట్లోని పెరట్లో చెట్టుపై దాచిన కోటి రూపాయలను ఆదాయ పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అశోక్ కుమార్ రాయ్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు సుబ్రమణ్య రాయ్ ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. చెట్టుపై బాక్సులు ఉండటం గమనించారు. వాటిని తీసి చూడగా నోట్ల కట్టలు కనిపించాయి. మొత్తం డబ్బును అధికారులు సీజ్ చేశారు. ఆ డబ్బును లెక్కించగా మొత్తం కోటి రూపాయలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి ప్రకారం.. నిబంధనలను ఉల్లంఘించినందుకు 2,346 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరుగనుండగా.. మే 13న ప్రకటించబడతాయి.

Read Also: School Shooting: స్కూల్‌లో విద్యార్థి కాల్పులు.. 8 మంది పిల్లలు, గార్డు హతం

ఎన్నికల నేపథ్యంలో ఆదాయపు పన్ను అధికారులు కొన్ని రోజులుగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా దొరికిన నగదును సీజ్ చేస్తున్నారు. అంతకుముందు ఏప్రిల్ 13న బెంగళూరు సిటీ మార్కెట్ ఏరియాలో రూ.కోటిని పోలీసులు జప్తు చేశారు. ఇద్దరు వ్యక్తులు ఆటోలో డబ్బు తీసుకెళ్తుండగా పట్టుకున్న పోలీసులు.. ఎలాంటి లెక్కలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు.