Site icon NTV Telugu

Oscar 2026: ఆస్కార్ రేసులో దూసుకుపోతున్న కన్నడ చిత్రాలు.. తొలి పరీక్ష విజయవంతం..

Oscars 2025

Oscars 2025

Oscar 2026: భారతీయ సినిమాలు మరోసారి అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటాయి. కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన రెండు సినిమాలు కాంతార చాఫ్టర్‌ 1, మహావతార్‌ నరసింహా ఆస్కార్‌ అవార్డ్స్‌ రేసులోకి వచ్చాయి. రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార: ఎ లెజెండ్ – ఛాప్టర్ 1’, హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన మహావతార్‌ నరసింహా చిత్రాలు ఆస్కార్ పోటీలోకి అడుగుపెట్టాయి. 98వ అకాడమీ అవార్డుల కోసం పరిశీలనకు అర్హత పొందిన 201 ఫీచర్ ఫిల్మ్‌ల జాబితాలో ఈ రెండు సినిమాలు చోటు దక్కించుకున్నాయి. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ విడుదల చేసిన ఈ జాబితాను ప్రముఖ మ్యాగజైన్ వెరైటీ వెల్లడించింది. ఆస్కార్‌ అవార్డ్స్‌ల జనరల్‌ ఎంట్రీలో ఈ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. దీంతో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ డైరెక్టర్‌తో పాటు నిర్మాత, స్క్రీన్‌ప్లే, ప్రొడక్షన్‌ డిజైన్‌, సినిమాటోగ్రఫీ వంటి ఇతర కేటగిరీల్లోనూ ఇవి పోటీపడబోతున్నాయి. ఆస్కార్ పోటీలో నిలవాలంటే కేవలం సినిమా రిలీజ్ చేయడమే కాకుండా కొన్ని కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అమెరికాలో టాప్ 50 మార్కెట్లలో కనీసం 10 చోట్ల థియేటర్లలో ప్రదర్శన జరగాలి. అలాగే ప్రతినిధిత్వం, సమానత్వానికి సంబంధించిన ప్రత్యేక ఫారమ్‌ను కూడా సమర్పించాలి.

READ MORE: Bhadradri Kothagudem: 12 ఏళ్ల బాలికపై పాతికేళ్ల కామాంధుడి దురాగతం.. ఐదో నెల గర్భవతి అని తేల్చిన వైద్యులు

ఈ అన్ని అర్హతలను పూర్తి చేసిన తర్వాతే సినిమాలు ఉత్తమ చిత్రం విభాగానికి అర్హత పొందుతాయి. ఆ ప్రమాణాలను ‘కాంతార’ ప్రిక్వెల్, మహావతార్‌ నరసింహా చిత్రాలు విజయవంతంగా పూర్తి చేయడంతో ప్రపంచస్థాయి పోటీలోకి అడుగుపెట్టాయి. భారతీయ కథలు, సంస్కృతి, భావోద్వేగాలు అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయికి చేరుతున్నాయనేందుకు ఇది మరో ఉదాహరణగా సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఆస్కార్ తుది జాబితాలో ఈ సినిమాలు చోటు దక్కుతాయా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Exit mobile version