Darshan and Pavithra Gowda Completes 100 Days in Jail: తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో, ఢీ బాస్ దర్శన్ తూగుదీప జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దర్శన్ బళ్లారి సెంట్రల్ జైలులో ఉన్నారు. అతడి జ్యుడీషియల్ కస్టడీని బెంగళూరు కోర్టు మంగళవారం సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడ, మరో 15 మంది నిందితుల జ్యుడీషియల్ కస్టడీని కూడా సెప్టెంబర్ 30 వరకు న్యాయస్థానం పొడిగించింది. దాంతో మరికొన్ని రోజలు అందరూ జైల్లోనే ఉండనున్నారు.
రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ జైలు పాలై 100 రోజులు పూర్తయింది. దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ కూడా జైలులో సెంచరీ కొట్టారు. ఎన్నో వంద రోజుల సినిమాల్లో నటించిన దర్శన్.. జైలులోనూ వంద రోజుల జీవితాన్ని పూర్తి చేసుకోవడం అభిమానులకు మింగుపడడం లేదు. జైలు నుంచి తమ అభిమాన హీరో ఎప్పుడు విడుదల అవుతారని ఫాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. జూన్ 11న దర్శన్‌ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: IND vs BAN: టాస్ గెలిచిన బంగ్లా.. ముగ్గురు పేసర్లతో బరిలోకి భారత్! తుది జట్లు ఇవే
చిత్ర పరిశ్రమలో 100 రోజులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఓ హీరోకు 100 రోజులు అనేది ఎంతో ముఖ్యమైన ఘట్టం. థియేటర్లో 100 రోజులు సినిమా ఆడితే.. అది బ్లాక్ బస్టర్ అవుతుంది. హీరోకు క్రేజ్ మరింత పెరుగుతుంది. 2001లో ఢీ బాస్ దర్శన్ నటించిన మొదటి సినిమా ‘మెజిస్టిక్’ కూడా గాంధీనగరలో 100 రోజులు ఆడింది. దర్శన్ నటించిన చాలా సినిమాలు కూడా సెంచరీ కొట్టాయి. అయితే థియేటర్లలో సెంచరీ కొట్టే ఢీ బాస్.. అనూహ్యంగా జైలులో 100 రోజులు పూర్తిచేసుకున్నాడు. పవిత్ర గౌడకు అసభ్యకరంగా మెసేజ్ చేశాడని జూన్ 8న చిత్రదుర్గ నుంచి రేణుకాస్వామిని బెంగళూరుకు పిలిపించి దారుణంగా హత్య చేసింది దర్శన్ గ్యాంగ్. జూన్ 9 కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్శన్ గ్యాంగ్‌ను విచారించగా ఆయన పేరు బయటకు వచ్చింది. జూన్ 11న మైసూరు ర్యాడిసన్ హోటల్‌లో దర్శన్ అరెస్ట్ అయ్యారు.