NTV Telugu Site icon

Kanipakam Ganesh Temple : కాణిపాకం వినాయక స్వామి వారి అభిషేకం టికెట్ ధరలు పెంపు.. క్లారిటీ ఇచ్చిన దేవాదాయ శాఖ

Kanipakam Temple

Kanipakam Temple

ఏపీలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి అభిషేకం టికెట్ ధరలు పెంతుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే దీనిపై దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ క్లారిటీ ఇచ్చారు. కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానం నందు శ్రీ స్వామి వారి అభిషేకం టికెట్ ధరను ఏ మాత్రం పెంచలేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఉన్న ధర రూ.700 లనే యధావిధంగా కొనసాగించడం జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలియజేసింది. దాతల సహాయ సహకారాలతో అత్యంత సుందరంగా పున:నిర్మించిన ఆలయంలో సామాన్యుల భక్తులకు పెద్దపీట వేస్తూ స్వామివారి అభిషేకం భక్తులు అందరికీ అందుబాటులో ఉండాలని దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు సభ్యులు దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవడమైనది. శ్రీ స్వామివారి అభిషేకం టికెట్ ధర రూ. 700/- ను రూ.5,000/- లకు పెంచడానికి ఆలయ అధికారులు విడుదల చేసిన అభిప్రాయ సేకరణ పత్రము (RC.No.G1/2380/2011, Date:27/09/2022) ఆలయ అధికారుల అవగాహనా రాహిత్యంగా పరిగణించడమైంది. ఈ “అభిప్రాయ సేకరణ పత్రము” పై పూర్తి స్థాయిలో చర్చజరిపి ఉపసంహరించుకునేలా దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు సభ్యులు నిర్ణయం తీసుకోవడమైనది.

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ, దేవాదాయ శాఖ కమీషనర్ దృష్టికి కానీ తెలియపరచకుండా టిక్కెట్లు ధర పెంపు విషయంలో ఏకపక్ష నిర్ణయం తీసుకున్న వారిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ ప్రకటనలో తెలియజేయడమైంది. శ్రీ స్వామివారి అభిషేకం విషయంలో భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం అమల్లో ఉన్న విధానమే యదావిధిగా కొనసాగడం జరుగుతుందని, ఎలాంటి మార్పులు లేవని భక్తులకు ఈ సందర్భంగా తెలియజేయడమైనది. ప్రస్తుతానికి ఆలయంలో ఎలాంటి టికెట్ ధరలను పెంచడం లేదని తెలియజేడమైంది. శ్రీ స్వామివారి అభిషేకం భక్తులు ప్రత్యక్షంగానూ, పరోక్షంగాను జరిపించుకునేలా ఆలయంలో ఏర్పాట్లు చేయడమైనది, భక్తులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారి కృపాకటాక్షములకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నారు అని ఓ ప్రకటనను విడుదల చేశారు అధికారులు.

 

Show comments