గుంటూరులో జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, న్యాయమూర్తులు జస్టిస్ మానవేంద్ర రాయ్, జస్టిస్ ఆకుల శేషసాయి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణపై వీరు చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. గవర్నర్ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ…గుంటూరులో జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడం తనకు అపారమైన గౌరవంగా ఉందన్నారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ వేదికపై మాట్లాడటం ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. ఒడిశా గవర్నర్‌గా ఉన్నప్పటికీ, ఒక తెలుగువాడిగా ఈ మహాసభలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనకు ఎన్నో విలువలు నేర్పి చక్కటి వ్యక్తిత్వాన్ని అందించినది తెలుగు సంప్రదాయమేనని పేర్కొన్నారు.
తెలుగు భాషను కాపాడి భావితరాలకు అందించిన మహనీయులందరికీ నివాళులు అర్పించిన ఒడిశా గవర్నర్ హరిబాబు.. తెలుగు భాష కోసం నిరంతరం కృషి చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నాట్యకారులు, జానపద కళాకారులు, రచయితలు చేసిన సేవల వల్లే తెలుగు భాష ఈ స్థాయికి చేరిందన్నారు. భక్తి ఉద్యమాల ద్వారా ఆధ్యాత్మిక లోతు సాధించిందని, సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచాన్ని తాకే స్థాయికి తెలుగు ఎదిగిందని చెప్పారు. కాలక్రమంలో మార్పులు వచ్చినప్పటికీ తెలుగు భాష తన ఉనికిని కోల్పోలేదన్నారు. ప్రభుత్వాలు మాత్రమే కాకుండా ప్రజల సహకారం కూడా భాషా పరిరక్షణకు ఎంతో అవసరమని స్పష్టం చేశారు.
Also Read: Vidadala Rajini: ఎమ్మెల్యే కుమారుడే డ్రగ్స్ తీసుకుంటూ దొరకటం సిగ్గుచేటు!
జస్టిస్ మానవేంద్ర రాయ్ మాట్లాడుతూ.. మొదట తెలుగు మహాసభలకు హాజరు కావడంపై కొంత సంకోచం కలిగిందన్నారు. ఉద్యోగరీత్యా ఆంగ్లంతో ఎక్కువ అనుబంధం ఉండటంతో తెలుగులో మాట్లాడే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. బ్రిటిష్ పాలన కారణంగా చట్టాలు, వైద్య విద్య వంటి రంగాల్లో ఆంగ్ల భాష ఆధిపత్యం కొనసాగుతోందని చెప్పారు. బ్రిటిష్ వారు వెళ్లిపోయినా వారి భాష మాత్రం మన జీవితాల్లో భాగమైందని వ్యాఖ్యానించారు. ఆంగ్ల ప్రభావం నుంచి బయటపడేందుకు ప్రత్యేక దృష్టి అవసరమన్నారు. గుజరాత్‌లో ప్రభుత్వ పరమైన అన్ని వ్యవహారాలు గుజరాతి భాషలోనే జరుగుతాయని ఉదాహరణగా పేర్కొన్న ఆయన.. ప్రభుత్వ విధానాల ద్వారా భాషాపరమైన మార్పు సాధ్యమని అన్నారు. మాతృభాషను సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ తెలుగు మహాసభలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. కేవలం మూడు రోజుల మహాసభలకే పరిమితం కాకుండా, భాషా పరిరక్షణకు నిరంతర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
జస్టిస్ ఆకుల శేషసాయి తన వ్యాఖ్యలతో సభను భావోద్వేగానికి గురి చేశారు. సందేశం ఇవ్వడానికి రాలేదని, నాలుగు అమ్మ మాటలు వినడానికి వచ్చానని అన్నారు. మాతృభాషను విస్మరిస్తే ఆ జాతి మనుగడే కష్టమని హెచ్చరించారు. అమ్మను, అమ్మ భాషను గౌరవించే వారు ఎప్పటికీ తప్పు చేయరని పేర్కొన్నారు. పిల్లలను మాతృభాషకు దూరం చేయవద్దని, అమ్మ భాషను తప్పనిసరిగా భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. మొత్తంగా గుంటూరు వేదికగా జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు భాష ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేశాయి. ప్రముఖుల వ్యాఖ్యలు తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణపై ఆలోచనలకు దారితీశాయి.
