Site icon NTV Telugu

Kaloji: నీ బానిసను నేను కాను.. తొత్తు కొడుకునసలే కాను..

Kaloji Narayana Rao

Kaloji Narayana Rao

Kaloji: తెలంగాణ కోసం, ఇక్కడి ప్రజల హక్కుల కోసం పోరాడిన మహావ్యక్తి ప్రజాకవి కాళోజీ నారాయణరావు. పుట్టుక, చావు తప్ప బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు కాళోజి. తన భావాలను తెలంగాణ యాసలో.. సులభంగా అర్ధమయ్యే భాషలో చెప్పేవారు. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి.. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి.. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని గర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి. తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జయంతి అయిన సెప్టెంబర్‌ 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించడమే కాకుండా యేటా ఆయన పేరిట సాహితీ పురస్కారాలను అందిస్తూ గౌరవిస్తున్నది.

READ ALSO: TGPSC : గ్రూప్‌ 1 మెయిన్స్‌ మెరిట్‌ లిస్ట్ రద్దు.. సంచలన తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు

నీ బానిసను కాను నేను
తొత్తు కొడుకునసలే కాను
నా ఇష్టం వచ్చినట్లు
నా మనసుకు నచ్చినట్లు
మాట్లాడుతా, రాస్తా, ప్రకటిస్తా

కాళోజీ 1914 సెప్టెంబర్ 9న కర్ణాటక రాష్ట్రం, బీజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించాడు. ఆయన తల్లి రమాబాయమ్మ కన్నడిగుల ఆడబిడ్డ. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు. మాడపాటి, సురవరం, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పీవీ నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. కాళోజీ కన్నడ, హిందీ, ఉర్దూ, మరాఠీ, ఇంగ్లిషు భాషల్లో అనేక రచనలు చేసి ప్రజలను చైతన్యపరిచారు. ఆయన సత్యాగ్రహంలో పాల్గొని 25 ఏళ్ల వయసులోనే జైలుకు వెళ్లి వచ్చారు. కాళోజీ ఎవరికీ జంకకుండా తన రచనలు చేస్తూ, నిర్మొహమాటంగా చెప్పేవారు. ముఖ్యంగా కాళోజీ రాసిన ‘నా గొడవ‘ సామాజిక సమస్యలపై అధికారులకు, పాలకులకు సవాల్‌గా నిలిచింది.

విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్‌లో గణపతి ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్ స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకడు. ఆనాడు వరంగల్​ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు కాళోజీకి నగర బహిష్కరణ శిక్ష విధించారు . స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర కీలకం. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యాడు. కాకతీయ విశ్వవిద్యాలయం కాళోజీకి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

నాటి ముఖ్యమంత్రిపైనే పోటీ..
నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై 1977లో సత్తుపల్లి (ఖమ్మం జిల్లా) నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. కానీ ఓడిపోయాడు. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ ‘సామాన్యుడే నా దేవుడు’ అని ప్రకటించిన కాళోజీ 2002 నవంబరు 13 న తుదిశ్వాస విడిచాడు. ఆయన మరణానంతరం కాళోజీ పార్థివ శరీరాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అందజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా 1958 నుంచి 1960 వరకు పనిచేశారు. రెండేండ్లు ఏ పార్టీకి చెందని స్వతంత్ర సభ్యుడిగా ఉన్నాడు. కాళోజీ ‘ఆంధ్ర సారస్వత పరిషత్’ వ్యవస్థాపక సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీలో సభ్యుడు.

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబరు 9న నిర్వహిస్తున్నారు. తెలంగాణ రచయిత కాళోజీ నారాయణరావు 100వ జయంతి సందర్భంగా.. కాళోజీ పుట్టినరోజైన సెప్టెంబరు 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో భాష సాహిత్యరంగంలో విశేష కృషి చేసిన వారికి రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నుంచి రాష్ట్రస్థాయి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.

READ ALSO: Vice President Election : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీల నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేసిన ఇద్దరు ఎంపీలు

Exit mobile version