Site icon NTV Telugu

Kaleshwaram Project: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 తుది గడువు!

కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్‌లకు ఆహ్వాన ప్రక్రియ (టెండర్లకు ఆహ్వానం) ప్రారంభించింది. డిజైన్ ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ఆసక్తి పత్రాలను ఆహ్వానించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) కమిటీ దర్యాప్తుల ఆధారంగా రిహాబిలిటేషన్ అండ్ రెస్టోరేషన్ డిజైన్లు చేయనుంది. డిజైన్ల కోసం ఆసక్తి పత్రాలు అక్టోబర్ 15 మధ్యాహ్నం 3 గంటల లోపు సమర్పించాలి. అక్టోబర్ 15 సాయంత్రం 5 గంటలకు సీల్ కవర్స్ ఓపెన్ చేస్తారు. ఫుల్ డీటెయిల్స్ తెలంగాణ నీటిపారుదల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకులో పియర్స్‌ కుంగడంతో పాటు.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో బుంగలు బయటపడిన విషయం తెలిసిందే. ఈ మూడు బ్యారేజీల పునరుద్ధరణపై ఎన్‌డీఎస్‌ఏ మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకెళ్లాలని ఈ ఏడాది ప్రభుత్వం నిర్ణయించింది. అనేక చర్చల అనంతరం ఐఐటీలకు అప్పగించాలన్న నిర్ణయం నుంచి నీటిపారుదల శాఖ వెనక్కి తగ్గింది. ఈవోఐ విధానంలోనే డిజైన్ల ఖరారుకు ఓకే చెప్పింది. తాజాగా పునరుద్ధరణ డిజైన్ల కోసం టెండర్లకు రేవంత్ రెడ్డి సర్కార్ ఆహ్వానం పలికింది. డిజైన్ల కోసం అక్టోబర్‌ 15 వరకు గడువు విధించింది.

Also Read: Nizamabad Shocker: భార్యపై అలిగి కరెంట్ పోల్ ఎక్కిన భర్త.. రెండు గంటల పాటు హంగామా!

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు కమిషన్‌ను ఏర్పాటు చేసింది. విచారణ అనంతరం ప్రభుత్వానికి 600 పేజీలతో రిపోర్టును పీసీ ఘోష్ కమిషన్ అందించింది. కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టిన సీఎం.. కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కేసును టేకప్ చేసిన సీబీఐ.. విచారణను ప్రారంభించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. త్వరలో మాజీ సీఎం కేసీఆర్ సహా హరీష్ రావు, ఈటలతో పాటు పలువురు అధికారులను విచారించనుందని తెలుస్తోంది.

Exit mobile version