Road Accident: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి..

Road Accident

Road Accident

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని కత్తిపూడి జాతీయ రహదారిపై ఉన్న రావికంపాడు జంక్షన్ దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. విజయనగరం జిల్లా డెంకాడ గ్రామానికి చెందిన కొందరు భవానీ భక్తులు అమ్మవారి దర్శనం కోసం ప్రైవేటు బస్సులో విజయవాడ బయలుదేరారు. ప్రయాణం మధ్యలో వీరి బస్సులో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు.

బస్సు మరమ్మతులకు గురికావడంతో అందులో ఉన్న భవానీ భక్తులు టీ తాగేందుకు రోడ్డు పక్కన నడుచుకుంటూ సమీపంలోని దుకాణం వైపు బయలుదేరారు. అదే సమయంలో అటుగా వేగంగా దూసుకొచ్చిన ఒక స్కార్పియో వాహనం అదుపుతప్పి నడుచుకుంటూ వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సిరిగుడి యాదయ్య, లింగాల సీతారాం, ప్రసాదుతో సహా మరో భవానీ భక్తుడు కలిపి మొత్తం నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు భవానీలు బోనుల రమణ, సత్తిబాబు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అయితే ఆసుపత్రికి తరలిస్తున్న మార్గమధ్యంలో మరో భక్తుడు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. ఈ అకస్మాత్తు ప్రమాద వార్త తెలియడంతో మృతుల సొంతూరైన విజయనగరం జిల్లా డెంకాడ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. భవానీ దీక్షలో ఉండి దైవదర్శనానికి బయలుదేరిన భక్తులు ఇలా అర్ధాంతరంగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం అవుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.