Kadapa Mayor Disqualified: కడప మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. కడప మేయర్ సురేష్ బాబుపై వేటుపడటం పొలిటికల్‌గా దుమారం రేపుతోంది. తన కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని కన్స్ట్రక్షన్స్ సంస్థకు కాంట్రాక్ట్ పనులు అప్పగించాడని విజిలెన్స్ విచారణలో తేలింది. వర్ధిని సంస్థలో కొత్తమద్ది అమరేష్, కొత్తమద్ది జయశ్రీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉన్నారని తెలుస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955 క్లాసెస్ 22 (1) ప్రకారం మేయర్ నేరుగా గాని, కుటుంబ సభ్యుల ద్వారా గాని కార్పొరేషన్ కాంట్రాక్టు పనులు చేయడం నిబంధనలకు విరుద్ధం. మున్సిపల్ యాక్ట్ నిబంధనలను అతిక్రమిస్తే ప్రజా ప్రతినిధులు వారి పదవులకు అనర్హులు అవుతారు. ఈ అంశంపై మేయర్ సురేష్ బాబు పై అనర్హత వేటు వేస్తూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఇదంతా పక్కా రాజకీయ కుట్రగా వైసీపీ ఆరోపిస్తోంది.
వైఎస్ కుటుంబానికి 25 ఏళ్లుగా కంచుకోట కడప కార్పొరేషన్. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు కడప కార్పొరేషన్ లో వారి కుటుంబం చెప్పిందే వేదం. వారి అనుయాయులే అక్కడ కార్పొరేటర్లు.. 2006లో కడప మున్సిపాలిటీని కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ చేశారు. అప్పటినుంచి 3 పర్యాయాలు జరిగిన కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో వైఎస్ కుటుంబం చెప్పిన వ్యక్తిలే మేయర్ గా కొనసాగుతూ వస్తున్నారు. రెండుసార్లు మేయర్ పగ్గాలు చేపట్టారు కొత్త మద్ది సురేష్ బాబు. అయితే, టీడీపీ ఎమ్మెల్యేతో జరిగిన ఒక కుర్చీ గొడవ, చివరికి ఆయన కుర్చీకే ఎసరు తెచ్చిందని స్థానికంగా చర్చ జరుగుతోంది.
సార్వత్రిక ఎన్నికల్లో 25 సంవత్సరాల తర్వాత టీడీపీ అభ్యర్థి కడపలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ లో కడప ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాధవి మున్సిపల్ కార్పొరేషన్ సమావేశానికి వచ్చారు. మొదటి సమావేశంలో అంతా సాఫీగానే జరిగింది. రెండవ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం నుంచి గోల మొదలైంది. గత ఏడాది నవంబర్ 7న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో వేదికపైన ఎమ్మెల్యే మాధవికి సీటు లేకుండా చేశారు మేయర్ సురేష్ బాబు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మాధవి వేదికపై సీటు లేకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. 20 సంవత్సరాలుగా మున్సిపల్ సమావేశ వేదికపై ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించి ఇప్పుడు ఎందుకు సీటు వేయలేదు అంటూ ఆమె మేయర్ ను ప్రశ్నించారు. ఇక్కడి నుంచి మొదలైన మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే మాధవి మధ్య మాటల యుద్ధం ఫిర్యాదుల వరకు వెళ్ళాయి. డిసెంబర్ 18న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం అత్యంత గందరగోళం మధ్య సాగింది. అవినీతి అక్రమాలపై కార్పొరేషన్ లో జరుగుతున్న అక్రమాలపై ఎమ్మెల్యే మాధవి ఆరోపణల వర్షం కురిపించారు.
కడప కార్పొరేషన్ అవినీతి అక్రమాలను నిగ్గు తేల్చాలంటూ రాష్ట్ర విజిలెన్స్ అధికారులకు ఎమ్మెల్యే మాధవి ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ విచారణలో మేయర్ సురేష్ బాబు కుటుంబ సభ్యులు కాంట్రాక్టర్ అవతారం ఎత్తారని గుర్తించారు. మీపై ఎందుకు అనర్హత వేటు వేయకూడదో సమాధానం చెప్పాలంటూ మార్చి 28న షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీస్ పై మేయర్ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. సమాధానం ఇవ్వడానికి గడువు ఇవ్వాలంటూ ఆయన హైకోర్టును అభ్యర్థించారు. రెండుసార్లు గడువు పెంచిన హైకోర్టు మూడోసారి విచారణ హాజరుకావాలని ఆదేశించింది. మున్సిపల్ యాక్ట్ ప్రకారం, మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మేయర్ పదవి నుంచి సురేష్ బాబును తొలగిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఇప్పుడు కడప మున్సిపల్ కార్పొరేషన్‌కు చేరింది..
