“ఏ నావదే తీరమో… ఏ నేస్తం ఏ జన్మ వరమో…” అన్నారు పెద్దలు. అదే తీరున మలబారు తీరంలోని ఏసుదాస్ గానం తెలుగువారినీ అలరించింది. మరి అది ఏ జన్మ వరమో! తెలుగునాట ఏసుదాస్ పాటకు పట్టాభిషేకం చేసేవారెందరో ఉన్నారు. అసలు ఏసుదాస్ మధురగానంతోనే దినచర్యను ప్రారంభించే అభిమానులు ఎందరో! తొలిసారి తెలుగువారిని ‘బంగారు తిమ్మరాజు’తో ఏసుదాస్ గాత్రం పలకరించింది. కాంతారావు హీరోగా నటించిన ఈ సినిమాలో ఎస్పీ కోదండపాణి స్వరకల్పనలో ఏసుదాస్ “ఓ నిండు చందమామా…” అనే పాట పాడారు. ఆ పాటలోని మధురం విన్నవారందరూ అది ఆ నాటి మధురగాయకుడు పి.బి.శ్రీనివాస్ పాడినదేనని భావించారట. తెలుగువారయిన పి.బి.శ్రీనివాస్ అప్పట్లో కన్నడ చిత్రసీమలో బిజీ సింగర్ గా ఉన్నారు. ఆయన కూడా ఏసుదాస్ పాడిన “నిండు చందమామ…” పాట విని, అరె “నా స్థాయిలోనే పాడుతున్నారే…” అని ఆశ్చర్య పోయారట! తరువాత ఏసుదాస్ ను ఓ సందర్భంలో కలుసుకున్న పి.బి.శ్రీనివాస్ “నిజంగానే నీ పాట నిండుచందమామ లాగే నిత్యం ఆనందం పంచుతుంది…” అంటూ దీవించారు. ఆ తరువాత అదే నిజమయింది!
ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే నటరత్న యన్టీఆర్ సైతం ఏసుదాస్ గానాన్ని అభిమానించారు. తాను నిర్మించిన తొలి రంగుల చిత్రం ‘శ్రీకృష్ణసత్య’లో హనుమంతుడు గానం చేసే “శ్రీరామ జయరామ… జయ జయ రామా…” పాటను కొన్ని శ్లోకాలను ఏసుదాస్ తో పాడించారు. పెండ్యాల సంగీతం సమకూర్చిన ‘శ్రీకృష్ణసత్య’ 1971 డిసెంబర్ 24న విడుదలై ఘనవిజయం సాధించింది. అప్పటి నుంచీ తెలుగువారు సైతం ఏసుదాస్ పాటతో సాగడానికి నిశ్చయించారు. ఆ తరువాతి సంవత్సరం తాను తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన ‘కులగౌరవం’లోనూ ఓ కీలక గీతాన్ని ఏసుదాస్ తోనే పాడించారు యన్టీఆర్. కన్నడ సంగీత దర్శకుడు టి.జి.లింగప్ప స్వరకల్పనలో ఏసుదాస్ పాడిన “తెరచాప వంటిది జీవితం…” అనే పాట ఈ నాటికీ వింటే మనసు పులకించి పోతుంది. యన్టీఆర్ రాజకీయాల్లో ఉండగా, ఆయన నిర్మించి, నటించి, దర్శకత్వం వహించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో ఏసుదాస్ తో కొన్ని పాటలు, శ్లోకాలు పాడించారు. రవీంద్ర జైన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఇక యన్టీఆర్ నటవారసునిగా బాలకృష్ణ హీరోగా నటించిన తొలి చిత్రం ‘సాహసమే జీవితం’లో్నూ ఒక్క పాట మినహాయిస్తే మిగిలిన పాటలన్నీ ఏసుదాస్ పాడడం విశేషం.
ఏయన్నార్ కు ఏసుదాస్ నేపథ్యగానం చేసిన ‘మేఘసందేశం’ చిత్రం రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు సంపాదించింది. అక్కినేని నటించిన 200వ చిత్రమిది. రమేశ్ నాయుడు స్వరకల్పనలో రూపొందిన ఒక పాట మినహాయిస్తే, మిగిలిన పాటల్లో పురుష స్వరంలో పలికే పాటలన్నిటినీ ఏసుదాస్ పాడి అలరించారు. ఈ సినిమా ద్వారా ఏసుదాస్ కు ఉత్తమగాయకునిగా అటు జాతీయ అవార్డు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు లభించాయి.
కృష్ణ, ఎస్పీ బాలు మధ్య పొరపొచ్చాలు పొడసూపినప్పుడు, సీతారామ్ అనే గాయకునితో కొన్నాళ్ళు సాగారు. అయితే “ప్రతిభావంతుడు, పచ్చని కాపురం” వంటి చిత్రాలలో కృష్ణకు సైతం ఏసుదాస్ గానం అలరించింది. శోభన్ బాబు నటించిన “స్వయంవరం, జీవనపోరాటం, రామబాణం” వంటి చిత్రాలలోనూ ఏసుదాస్ గానం మధురం పంచింది. ఇక కృష్ణంరాజుకు ‘ధర్మాత్ముడు’లో ఏసుదాస్ పాడిన పాటనే ఓ ఎస్సెట్. ఏసుదాస్ పాటను తెలుగునాట ఎక్కువ చిత్రాలలో సంగీత దర్శకుడు సత్యం వినిపించే ప్రయత్నం చేశారు.
మోహన్ బాబు పరాజయాల బాటలో పయనిస్తున్న సమయంలో ‘అల్లుడుగారు’ చిత్రం నిర్మించి ఘనవిజయం సాధించారు. ఇందులోని శాస్త్రీయ గీతాలను, మరికొన్ని పాటలను ఏసుదాస్ గానం చేసి ఎంతగానో మురిపించారు. అప్పటి నుంచీ తాను హీరోగా నటించిన అనేక చిత్రాలలో మోహన్ బాబు, ఏసుదాస్ పాటతో సాగారు. మోహన్ బాబు కెరీర్ లో బిగ్ హిట్ గా నిలచిన ‘పెదరాయుడు’లోనూ ఏసుదాస్ గానమే ప్రాణం పోసింది.
చిరంజీవి సోదరులు తొలిసారి తమ అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ‘రుద్రవీణ’లోనూ ఇళయరాజా బాణీల్లో ఏసుదాస్ తో పాటలు పాడించారు. “లలిత ప్రియకమలం…”, “నీతోనే ఆగేనా సంగీతం…” వంటి కీలకమైన పాటలు ఏసుదాస్ గళంలోనే జాలువరడం విశేషం!
చిరంజీవి ‘హిట్లర్’, బాలకృష్ణ ‘పవిత్ర ప్రేమ’, నాగార్జున ‘సంకీర్తన’, వెంకటేశ్ “పవిత్రబంధం, పెళ్ళిచేసుకుందాం” వంటి చిత్రాలలోనూ ఏసుదాస్ పాటలు పరవశింప చేశాయి. మురళీమోహన్ “కుంకుమతిలకం, ఇదే నా సమాధానం” మొదలైన చిత్రాల్లోనూ ఏసుదాస్ పాటలు ఆనందం పంచాయి. “నిరీక్షణ, సరిగమలు” చిత్రాల్లోనూ ఏసుదాస్ పంచిన మధురాన్ని ఎవరు మాత్రం మరచిపోగలరు? ఇలా చెప్పుకుంటూ పోతే ఏసుదాస్ గళం నుండి జాలువారిన అనేక తెలుగు మధురగీతాలు మనల్ని పులకింప చేస్తూనే ఉంటాయి.
ఏసుదాస్ తన దరికి చేరిన ప్రతీ అవకాశాన్నీ వినియోగించుకున్నారు. సినిమా జయాపజయాలతో నిమిత్తం లేకుండా తెలుగులో ఏసుదాస్ పాటలు పాడిన అన్ని చిత్రాలలోనూ ఆయన పాటలే ప్రధాన ఆకర్షణగా నిలిచేవి. ఈ విషయాన్ని ఏసుదాస్ ను అన్నగా భావించే, మరో మధురగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సైతం తెలిపారు. ఏసుదాస్, బాలు కలసి పాడిన పాటలు కూడా తెలుగువారిని అలరించాయి. అనువాద చిత్రమైనా ‘దళపతి’లో వారిద్దరూ కలసి పాడిన “సింగారాల పైరుల్లోన…” సాంగ్ ఈ నాటికీ మురిపిస్తూనే ఉంది. తెలుగువారితోనూ, తెలుగు సినీజనంతోనూ చెరిగిపోని, తరిగిపోని బంధం ఏర్పరచుకున్న ఏసుదాస్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ హాయిగా సాగాలని కోరుకుందాం.