తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, ‘కర్ణాటక సింఘం’గా పేరుగాంచిన కే. అన్నామలై రాష్ట్ర రాజకీయాల్లో సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే తాను స్వయంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా పళనిలో జరిగిన ఒక కార్యక్రమంలో తన రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. త్వరలోనే సొంత పార్టీని ప్రారంభిస్తానని అధికారికంగా వెల్లడించారు.
రాజకీయాల్లోకి రాకముందు 2011 బ్యాచ్‌కు చెందిన కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారిగా పనిచేసిన అన్నామలై, తన నిర్ణయాలు, నిజాయితీ కారణంగా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన సర్వీస్‌కు రాజీనామా చేసిన అనంతరం ఆయన బీజేపీలో చేరి, తమిళనాడులో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. అయితే ఇటీవల పార్టీ పదవిని వీడిన ఆయన, ప్రస్తుతం ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ‘వి ది లీడర్స్’ పేరుతో ఒక నూతన సామాజిక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
ప్రస్తుతం ఈ ఉద్యమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జనహిత కార్యక్రమాలను ఆయన ముందుకు తీసుకువెళుతున్నారు. ముఖ్యంగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన కల్పించడం, పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక అంశాలపై ఆయన బృందం విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తోంది. అంతేకాకుండా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘వి ది లీడర్స్’ వేదిక తరఫున అభ్యర్థులను బరిలోకి దించి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
అన్నామలై తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయం తమిళనాడు రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ద్రవిడ పార్టీల ఆధిపత్యం ఉండే తమిళ రాజకీయాల్లో ఒక మాజీ ఐపీఎస్ అధికారి, ప్రజా ఉద్యమాల ద్వారా సొంత పార్టీని స్థాపించి ముందుకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే కాలంలో ఆయన పార్టీ ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.

