కందుకూరు, గుంటూరు సంఘటన మీద శేష శయనా రెడ్డి విచారణ చేపట్టారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభలో వారం రోజుల వ్యవధిలో జరిగిన రెండు ఘటనల్లో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. గుంటూరులో జనవరి 1న చంద్రన్న కానుక పేరుతో ఎన్టీఆర్ జనతా వస్త్రాలంటూ చేపట్టిన పంపిణీలో జరిగిన తొక్కిసలాట ముగ్గురి ప్రాణాలు తీసింది. అంతకముందు డిసెంబర్ 28న నెల్లూరు జిల్లాలోని కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది చనిపోయారు.ఈ వరుస ఘటనలు రాజకీయ దుమారం రేపాయి. తొక్కిసలాట ఘటనలను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ బి.శేష శయన రెడ్డి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ విచారణ కమిటీని నియమించింది.
కందుకూరు తొక్కిసలాట ఘటనపై విశ్రాంత న్యాయమూర్తి శేష శయనా రెడ్డి కమిషన్ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కందుకూరు తెలుగుదేశం నేతలు ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరి రాజేష్ లను శేష శయనా రెడ్డి కమిషన్ విచారణకు పిలిచింది. ఇవాళ ఉదయం 11గం.కు విజయవాడలోని ప్రభుత్వ అతిథి గృహంలో విచారణకు రావాలని నేతలకు శేష శయనా రెడ్డి కమిషన్ నోటీసులు పంపింది. ఇప్పటికే వారు విచారణ కోసం అక్కడికి చేరుకున్నారు.
కమిషన్ ముందు ఇవాళ సదరు నేతలు ఏం చెబుతారనేది ఆసక్తిగా మారింది. గుంటూరు ఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ని కూడా కమిషన్ విచారించనుంది. ఇప్పటికే గుంటూరు తొక్కిసలాట ఘటనపై విచారణ చేపట్టింది ఏక సభ్య కమిషన్.. విచారణ అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. వారం లోపే జస్టిస్ శేష శయనా రెడ్డి కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని భావిస్తున్నారు. ఈ కమిషన్ నివేదిక కీలకం కానుంది. మరి ఈ శేష శయనా రెడ్డి కమిషన్ ఏం తేలుస్తుందో చూడాలి.
Read Also: Letters War: ఏపీలో లేఖల యుద్దం.. అమర్నాథ్ వర్సెస్ హరిరామజోగయ్య
