Site icon NTV Telugu

Harikrishna Birth Anniversary: తండ్రి జయంతి రోజున భావోద్వేగ ట్వీట్ చేసిన ఎన్టీఆర్

Harikrishna

Harikrishna

Harikrishna Birth Anniversary: నందమూరి హరికృష్ణ 66వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ ఘనంగా నివాళులర్పించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ ట్వీట్ చేశాడు. ‘ఈ అస్తిత్వం మీరు.. ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు.. ఆజన్మాంతం తలచుకునే అశ్రుకణం మీరే’ అంటూ ఓ ఫోటోను ఎన్టీఆర్ షేర్ చేశాడు. మరోవైపు హరికృష్ణ పెద్దకుమారుడు నందమూరి కళ్యాణ్‌రామ్ కూడా ఇదే ఫోటోను ట్వీట్ చేశాడు. తమ తండ్రిని స్మరించుకుంటూ నందమూరి అన్నదమ్ములు చేసిన ట్వీట్లు అభిమానులను ఆకట్టుకున్నాయి.

కాగా 1964లో బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసిన హరికృష్ణ సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య వంటి సినిమాలతో అభిమానులను అలరించారు. 2018 ఆగస్ట్‌ 29న నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి దగ్గర జరిగిన ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మరణించారు. ఆయన నడుపుతున్న కారు బోల్తా పడటంతో హరికృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో ఓ ఫంక్షన్‌కు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. అంతకుముందు ఇదే ప్రాంతంలో హరికృష్ణ పెద్ద కొడుకు నందమూరి జానకిరామ్ కూడా ఇలా రోడ్డు ప్రమాదంలోనే మరణించాడు. రెండో కుమారుడు నందమూరి కళ్యాణ్‌రామ్ ఇటీవల బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.

Exit mobile version