Site icon NTV Telugu

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డికి ఛాన్స్..!

Deepak Reddy

Deepak Reddy

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ (BJP) తమ అభ్యర్థి పేరును ప్రకటించడంతో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ హైకమాండ్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షునిగా ఉన్న లంకల దీపక్ రెడ్డిని ఉప ఎన్నిక బరిలో తమ అభ్యర్థిగా ఎంపిక చేసింది. అభ్యర్థి ఎంపిక విషయంలో చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగింది. ఇద్దరు మహిళా నేతలు సహా పలువురు సీనియర్ల పేర్లను పరిశీలించినప్పటికీ.. వివిధ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని చివరకు దీపక్‌ రెడ్డికే అవకాశం ఇచ్చారు.

IND vs AUS: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. వన్డే సిరీస్ నుంచి ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఔట్!

లంకల దీపక్ రెడ్డికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో ఇదివరకే పరిచయం ఉంది. ఆయన గతంలో అంటే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన దాదాపు 25 వేల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. తాజాగా అభ్యర్థి ప్రకటన రావడంతో నామినేషన్లకు ఈ నెల 21వ తేదీ వరకు గడువు ఉన్నందున, బీజేపీ నాయకులు ఇక ప్రచారంలో వేగం పెంచనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అయితే అనారోగ్య కారణాల వల్ల ఆయన ఇటీవల మరణించడంతో ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక పోలింగ్‌కు షెడ్యూల్ విడుదల చేసింది.

NTRNeel : ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ఏదో చేస్తున్నారు.. ఫ్యాన్స్ టెన్షన్?

ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలో బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తుండగా, అధికార కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ను బరిలోకి దింపింది. బీఆర్‌ఎస్ పార్టీ దివంగత మాగంటి గోపీనాథ్ భార్య అయిన మాగంటి సునీతను తమ అభ్యర్థిగా ఖరారు చేసింది. మాగంటి సునీత నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ ఉప ఎన్నికలో ఆసక్తికర విషయం ఏమిటంటే, బరిలో ఉన్న ముగ్గురు ప్రధాన అభ్యర్థులు దీపక్ రెడ్డి (బీజేపీ), నవీన్ యాదవ్ (కాంగ్రెస్), మాగంటి సునీత (బీఆర్‌ఎస్) జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన స్థానికులు కావడమే. గత కొన్ని ఎన్నికల నుంచి వీరు జూబ్లీహిల్స్‌లోనే పోటీ చేస్తూ వస్తున్నారు. స్థానికంగా ముగ్గురికీ పట్టు ఉన్న ప్రాంతం కావడంతో ఈ ఉప ఎన్నిక మరింత ఆసక్తికరంగా, ఉత్కంఠగా మారింది.

Exit mobile version