NTV Telugu Site icon

Joe Root: ఇంకెంతకాలం ఆడతావని ప్రశ్నించారు.. జో రూట్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Joe Root Tests

Joe Root Tests

Joe Root Abot Test Cricket: టెస్ట్ ఫార్మాట్‌ అంటే ఎందుకంత ఇష్టమని, ఇంకెంతకాలం ఆడతావని తనను చాలా మంది ప్రశ్నించారని ఇంగ్లండ్‌ స్టార్ బ్యాటర్ జో రూట్ తెలిపాడు. జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషించడానికి శ్రమిస్తా అని చెప్పాడు. తాను ఎప్పుడూ మైలురాళ్ల గురించి ఆలోచించనని, జట్టు విజయాల్లో తన పాత్ర ఏంటనేది కీలకమని జో రూట్ పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్‌ను మరింత కాలం ఆడేందుకు ప్రయత్నిస్తా అని చెప్పుకొచ్చాడు. సోమవారం నుంచి పాకిస్థాన్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ ఆడనుంది. పాక్‌ గడ్డపై జరుగుతున్న ఈ సిరీస్‌కు ముందు రూట్ మీడియాతో మాట్లాడాడు.

‘జట్టులో మిగతావారి కన్నా ఎక్కువ పరుగులు చేయడం ముఖ్యమే. కానీ వ్యక్తిగతంగా మనల్ని మనం జడ్జ్‌ చేసుకొనేటప్పుడు ఎన్ని విజయాల్లో మనం కీలక పాత్ర పోషించామనేది చూసుకోవాలి. ఇంగ్లండ్‌ గెలుపులో నా భాగస్వామ్యం ఎంతనేదే నన్ను ఆటలో ముందుకు నడిపిస్తుంది. ఆ మైండ్‌సెట్‌తో ఆడతాను కాబట్టే విజయవంతం కాగలుగుతున్నా. వ్యక్తిగతంగా నా ఆటను పూర్తిగా ఆస్వాదిస్తా. ఆ క్షణాన్ని ఆస్వాదించడం వల్లే మరిన్ని మ్యాచులు ఆడేందుకు ప్రేరణ కలుగుతోంది. టెస్టు క్రికెట్‌ను మరికొన్నేళ్లు ఆడేందుకు ప్రయత్నిస్తా. టెస్ట్ ఫార్మాట్‌ అంటే ఎందుకంత ఇష్టమని, ఇంకెంతకాలం ఆడతావని నన్ను చాలా మంది ప్రశ్నించారు. నేను ఎప్పటి వరకు క్రికెట్‌ ఆడగలనని అనుకుంటానో అప్పటి వరకూ ఆడుతా. ప్రస్తుతం జట్టుతో మంచి అనుబంధం ఉంది. మైదానంలోనే కాదు బయట కూడా మేం సరదాగా ఉంటాం’ అని జో రూట్ చెప్పాడు.

Also Read: IPL 2025: ఆర్‌సీబీ కెప్టెన్‌గా రోహిత్.. నవ్వుకున్న మాజీ లెజెండ్!

జో రూట్ 146 టెస్టుల్లో 12,402 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచేందుకు కేవలం 70 పరుగుల దూరంలోనే ఉన్నాడు. ఈ జాబితాలో అలిస్టర్ కుక్ (12,472) ముందున్నాడు. ఇక టెస్టుల్లో అత్యధిక రన్స్‌ చేసిన రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ పేరుపై ఉంది. 200 టెస్టుల్లో 15,921 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లలో రూట్‌ మాత్రమే సచిన్ రికార్డుకు చేరువగా ఉన్నాడు. టెస్ట్ స్టార్స్ స్టీవ్ స్మిత్ (9,685), విరాట్ కోహ్లీ (8,947), కేన్ విలియమ్సన్ (8,881) కూడా దరిదాపుల్లో లేరు.

Show comments