9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!

  • రూ.21.99 లక్షల ప్రారంభ ధరతో జీప్ కాంపాస్ స్పోర్ట్ 9AT లాంచ్
  • 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చిన ఎంట్రీ-లెవల్ వేరియంట్
  • 2.0-లీటర్ మల్టీజెట్ II టర్బో-డీజిల్ ఇంజిన్
  • 170 హెచ్‌పీ పవర్, 350 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి
  • భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు..
Jeep Compass Sport 9at

Jeep Compass Sport 9at

Jeep Compass Sport 9AT Launched: భారత ప్రీమియం ఎస్‌యూవీ (SUV) మార్కెట్లో జీప్ ఇండియా (Jeep India) కాంపాస్ లైనప్‌ను మరింత పెంచుతుంది. ఇందులో భాగంగా సరికొత్త జీప్ కాంపాస్ స్పోర్ట్ 9AT (Compass Sport 9AT) వేరియంట్‌ను రూ. 21.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఎంట్రీ-లెవల్ వేరియంట్ అయిన ‘స్పోర్ట్’ ట్రిమ్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ప్రవేశపెట్టడం ద్వారా, దేశంలోనే అత్యంత సరసమైన ధరలో లభించే ఆటోమేటిక్ జీప్ కాంపాస్‌గా నిలవనుంది.

ఇప్పటివరకు జీప్ కాంపాస్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కావాలంటే వినియోగదారులు ఖరీదైన టాప్-ఎండ్ వేరియంట్లను ఎంచుకోవాల్సి వచ్చేది. అయితే ఈ కొత్త స్పోర్ట్ 9AT వేరియంట్‌తో ఆటోమేటిక్ డ్రైవింగ్ సౌకర్యాన్ని తక్కువ ధరకే ఎక్కువ మంది వినియోగదారులకు జీప్ చేరువ చేసింది. ఈ ఎస్‌యూవీలో జీప్‌కు చెందిన 2.0-లీటర్ మల్టీజెట్ II టర్బో-డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 170 hp పవర్, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను జత చేశారు. నగరాల్లోని ట్రాఫిక్ పరిస్థితుల్లోనూ, హైవేలపై ప్రయాణాల్లోనూ సాఫీగా, సులభంగా డ్రైవింగ్ అనుభూతిని అందించేందుకు ఈ కాంబినేషన్ చక్కగా ఉపయోగపడుతుంది.

కాంపాస్ లైనప్‌లో ఇది ఎంట్రీ-లెవల్ వేరియంట్ అయినప్పటికీ.. అనేక ఆధునిక సేఫ్టీ, కంఫర్ట్ ఫీచర్లను అందించారు. ఇందులో భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, క్రూయిజ్ కంట్రోల్, ఆటో హోల్డ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMలు ఉన్నాయి. అలాగే వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ చేసే 21.3 cm Uconnect టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను చేర్చారు. ఉత్తమ డ్రైవింగ్ కంఫర్ట్, హ్యాండ్లింగ్ కోసం జీప్ ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ డ్యాంపింగ్ (FSD) సస్పెన్షన్, డైనమిక్ స్టీరింగ్ టార్క్ (DST) వ్యవస్థలను ఈ వేరియంట్‌లోనూ కొనసాగించారు. కారుకు అదనపు ఆకర్షణను జోడించాలనుకునే కొనుగోలుదారుల కోసం కంపెనీ రూ. 29,900 ధరతో ఆప్షనల్ యాక్సెసరీ ప్యాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో యాంబియంట్ లైటింగ్, ప్రిడిక్టివ్ సేఫ్టీ ఫీచర్లు కలిగిన డ్యాష్‌క్యామ్, ఆల్-వెదర్ ఫ్లోర్ మ్యాట్స్, మడ్ ఫ్లాప్స్ మరియు ఎక్స్‌టీరియర్ డెకాల్స్ లభిస్తాయి.

దేశవ్యాప్తంగా ఉన్న జీప్ డీలర్‌షిప్‌లు, స్టెల్లాంటిస్ బ్రాండ్ హౌస్‌ల ద్వారా నవంబర్ రెండవ వారం నుంచి ఈ కొత్త కాంపాస్ స్పోర్ట్ 9AT డెలివరీలు ప్రారంభం కానున్నాయి. మార్కెట్లో ఎస్‌యూవీలకు గిరాకీ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. ఎక్కువ ఖర్చు లేకుండా బ్రాండెడ్ డీజిల్ ఆటోమేటిక్ ఎస్‌యూవీని కోరుకునే వారికి ఇది సరైన ప్రత్యామ్నాయంగా నిలవనుంది.