Site icon NTV Telugu

JDS: కింగ్‌ అన్నారు.. కింగ్‌ మేకర్‌ అన్నారు.. షాక్‌లో జేడీ(ఎస్‌)

Jds

Jds

JDS: కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే తామే కీలకం అవుతామని కుమారస్వామి భావించారు. తమ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న ఓల్డ్‌ మైసూర్‌ ప్రాంతంలో సత్తా చాటితే చాలనుకున్నారు. కానీ జనం ఆలోచన మాత్రం వేరేగా ఉంది. 35నుంచి 40 స్థానాలైనా గెలవాలని టార్గెట్ పెట్టుకుంటే అందులో సగం మాత్రమే ఇచ్చారు. 224 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో జేడీఎస్ గెలిచింది కేవలం 20 స్థానాల్లో మాత్రమే…

దేవెగౌడ సామాజిక వర్గం వక్కలిగ. వారు ఎక్కువగా ఉన్న ఓల్డ్‌ మైసూర్‌ ప్రాంతం జేడీఎస్‌కు కంచుకోట. గత కొన్ని ఎన్నికల్లో జేడీఎస్‌కు వచ్చిన సీట్లో 95శాతం ఇక్కడ గెలిచినవే. గత ఎన్నికల్లో కూడా జేడీఎస్ 37గెలిచింది. అందులో 34 ఓల్డ్‌ మైసూర్‌లోనే గెలిచింది. పెద్దగా కష్టపడకుండానే ఇక్కడ సీట్లు నెగ్గొచ్చని జేడీఎస్ భావించే ఆ ప్రాంతమే ఈసారి ఆ పార్టీని దారుణంగా దెబ్బతీసింది. ఇక్కడ 64సీట్లలో కాంగ్రెస్‌ ఏకంగా 44సీట్లు నెగ్గింది. జేడీఎస్‌ కేవలం 15సీట్లకే పరిమితమైంది. మొత్తంగా చూస్తే జేడీఎస్ గెలిచింది కేవలం 19స్థానాలు మాత్రమే. దీంతో కింగ్‌మేకర్‌ ఆశలు ఆవిరైపోయాయి. దీంతో పాటు వక్కలిగ సామాజికవర్గంలో పట్టు కోల్పోవడం జేడీఎస్‌ను షాక్‌కు గురిచేసింది. ఇన్నాళ్లూ తమను గెలిపించిన సామాజికవర్గమే షాక్ ఇవ్వడాన్ని దేవెగౌడ కుటుంబం తట్టుకోలేకపోతోంది. పోటీ గట్టిగా ఉంటుందని భావించిన దేవెగౌడ 90ఏళ్ల వయసులోనూ ప్రచారం చేశారు. కానీ వక్కలిగ ఓటర్లు ఈసారి కాంగ్రెస్‌వైపు చూసినట్లు కనిపిస్తోంది. పీసీసీ చీఫ్‌ డీకే.శివకుమార్ అదే సామాజికవర్గానికి చెందినవారు. దేవెగౌడ అంత స్థాయి ఆయనకు లేకపోయినా ఆయన తర్వాత ఆ వర్గంలో చెప్పుకోదగ్గ నేతగా ఎదిగారు. దీనికి తోడు కాంగ్రెస్ గెలిస్తే డీకే సీఎం అయ్యే అవకాశాలున్నాయన్న ప్రచారం జరిగింది. దీంతో వక్కలిగ ఓటర్లు కాంగ్రెస్‌వైపు మొగ్గుచూపారు. దేవెగౌడ తర్వాత ఆయన కుమారుడు కుమారస్వామి ఆ స్థాయి పట్టు తెచ్చుకోకపోవడం కూడా దెబ్బతీసింది.

దేవెగౌడ కుటుంబానికి మరో గట్టి దెబ్బ సొంత కుటుంబ సభ్యుడ్నే గెలిపించుకోలేకపోవడం. అది కూడా తనకు పట్టున్న, తన సామాజికవర్గం బలంగా ఉన్న నియోజకవర్గం రామనగరలో ఓటమిని దేవెగౌడ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. దేవెగౌడ మనవడు, కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి ఈసారి రామనగర నుంచి పోటీ చేశారు. 10వేల ఓట్ల తేడాతో ఇక్బాల్‌ హుస్సేన్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. గతంలో ఈ స్థానం నుంచి కుమారస్వామి ఇదే ఇక్బాల్‌ హుస్సేన్‌పై గెలిచారు. కొడుకు కోసం కుమారస్వామి చెన్నపట్నకు మారారు. కానీ ఓటర్లు మాత్రం నిఖిల్‌ కుమారస్వామిని ఆదరించలేదు. నిఖిల్ గతంలో మాండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి సుమలతా అంబరీష్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా నెగ్గకపోవడంతో ఆయన రాజకీయ భవితవ్యం ప్రమాదంలో పడింది. అటు సినిమా రంగంలోనూ ఆయన విఫలమయ్యారు. ఇదే దేవెగౌడ కుటుంబాన్ని కలవరపెడుతోంది.

Exit mobile version